
పెందుర్తి : వైసిపి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు ప్రజల బాగోగుల కోసం కష్టపడే నిరంతర శ్రామికుడు అని పెందుర్తి, అనకాపల్లి ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్ రాజు, గుడివాడ అమర్నాథ్, ఎంపీ బి.సత్యవతి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, మల్ల విజయప్రసాద్ తదితరులు అభివర్ణించారు. పెందుర్తిలో ఆదివారం శరగడం జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. వందలాది మంది అభిమానులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు మధ్య శరగడం చినఅప్పలనాయుడు కేకు కట్ చేశారు. ఆయనకు ఎమ్మెల్యేలు కేకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు శరగడంనకు జగన్మోహన్రెడ్డి అవకాశమిచ్చారని, కొన్ని కారణాలతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారని తెలిపారు. త్వరలో శరగడం ఉన్నత పదవిని అధిరోహిస్తారని చెప్పారు. అభిమానులు పోటీపడి మరి భారీ గజమాలలు, నోట్ల దండలతో అప్పలనాయుడు సన్మానించారు. కాబోయే మేయర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.