Oct 25,2021 08:15

లోకనాథం, రంగనాథం మిత్రులు. ఇద్దరూ ఒకేరకమైన వృత్తిలో ఉన్నారు. ఇద్దరికీ ఒంటెద్దు బళ్లు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయాన్నే తమ గ్రామం నుంచి బయలుదేరి రాజధాని నగరం వెళ్తారు. అక్కడ వర్తకులు చెప్పిన చోటుకు తమ బళ్లమీద సరుకులు తీసుకెళ్లడం వారి పని. ఇలా వచ్చిన ఆదాయంతో ఇద్దరూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ఒకరోజు ఉదయం లోకనాథం బయలుదేరలేదు. రంగనాథం ఆయన దగ్గరికి వచ్చి, ''లోకనాథం.. ఏమిటీ! ఇంకా బయలుదేరినట్లు లేదు'' అని అడిగాడు.
''మా ఎద్దు కాలుకు వాపు వచ్చింది. నడవడానికి ఇబ్బంది పడుతోంది. నిన్న రాత్రి వైద్యుడు వచ్చి కట్టు వేశాడు. రెండుమూడు రోజులు ఎద్దుకు విశ్రాంతి కావాలన్నాడు'' అని చెప్పాడు లోకనాథం.
''వైద్యులు అలానే చెబుతారు. అయినా ఎద్దుకేం తెలుసు. కర్రతో నాలుగు కొడితే అదే పరుగు తీస్తుంది'' అన్నాడు రంగనాథం.
''మనల్ని పోషిస్తున్న ఆ మూగజీవులు బాగుంటేనే మనం బాగుంటాం. నా ఎద్దుకు బాగైన తర్వాతే నేను వస్తాను, నువ్వెళ్లు'' అన్నాడు లోకనాథం.
మూడు రోజుల తర్వాత లోకనాథం ఎద్దుకు నయమైంది. బండిని తీసుకొని నగరానికి వెళ్లడం ప్రారంభించాడు.
కొన్నిరోజుల తరువాత రంగనాథం ఎద్దుకూ కాలువాపు వచ్చింది. గమనించిన లోకనాథం.. ''రంగనాథం.. నీ ఎద్దు కాలికి వాపు వున్నట్లుంది, మెల్లగా నడుస్తోంది. వైద్యుడికి చూపించకూడదు'' అన్నాడు.
''వాపు లేదూ..గీపూ లేదూ.. ఒక దెబ్బ కొడితే అదే నడుస్తుంది, పరవాలేదులే'' అన్నాడు రంగనాథం.
నాలుగు రోజుల తర్వాత కాలువాపు ఎక్కువై ఆ ఎద్దు నడవలేకపోయింది. అయినా రంగనాథం దాన్ని బలవంతంగా నడిపిస్తున్నాడు. కొద్దిదూరం నడిచిన తరువాత ఎద్దు కిందపడిపోయింది. కాలు విరిగింది. అప్పుడు రంగనాథం వైద్యున్ని పిలిపించాడు. ఆయన ఎద్దును పరీక్షించి, ''వాపు పెద్దదై దాని కాలు ఎముక విరిగింది. ఇక ఈ ఎద్దు నడవలేదు. జంతువుకైనా, మనిషికైనా వ్యాధి మొదట్లోనే వైద్యం చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం పెద్దదవుతుంది'' అన్నాడు.
''నా నిర్లక్ష్యం వల్లే ఎద్దు కాలు విరిగింది. మరో ఎద్దు కొనేంతవరకు నా కుటుంబ పోషణకు నేను కూలిపని చెయ్యాలి'' అంటూ ఏడ్చాడు రంగనాథం.
 

- ఓట్ర ప్రకాష్‌రావు,

09787446026.