Oct 25,2021 06:50

నీ మీద ప్రేమ అలాగే ఉంది నేలకి
విత్తులు నాటితే మొక్కలు ఇస్తోంది
నువ్వే దాన్ని గుల్ల చేస్తున్నావు

నీ మీద నమ్మకం పోలేదు నీటికి
నిరంతరం సాకుతూనే ఉంది
నువ్వే దానికి చేదు కలుపుతున్నావు

నీ మీద అనురాగంలో మార్పు రాలేదు గాలికి
శ్వాసగా దేహంలో ప్రాణమవుతోంది
నువ్వే దానిలో విషం చల్లుతున్నావు

నీ మీద విశ్వాసం తగ్గలేదు నిప్పుకి
వేడీవెచ్చగా నిలబడుతోంది
నువ్వే దానితో సర్వం తగలబెడుతున్నావు

ఆకాశం నిన్నింకా దయతలుస్తూ
జీవధారలతో తడుపుతూనే ఉంది
నువ్వే ఓజోనుని ఒలిచేస్తున్నావు
నీ కోసమే అన్నీ అనుకుని
అన్నిటి వినాశనం నువ్వే - నీతో సహా!
- కళ్ళేపల్లి తిరుమలరావు
91770 74280