
ప్రజాశక్తి- శ్రీకాకుళం సిటీ: నగరంలోని ఏడు రోడ్ల కూడలిని ఆనుకొని ఉన్న బ్రిడ్జి రోడ్డులో ఆక్రమణలను కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ అధికారులు శుక్రవారం తొలగించారు. ఇటీవల జిల్లాలో ఎఎస్పిగా బాధ్యతలు చేపట్టిన విఠలేశ్వరరావు ట్రాఫిక్ నియంత్రణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. అందులో భాగంగా నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో అక్రమణలు తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు శుక్రవారం ఎసిపి సత్యన్నారాయణ ఆధ్వర్యంలో ఏడు రోడ్ల కూడలి, దుర్గాదేవి ఆలయం సమీపంలో ఆటో యూనియన్ విశ్రాంత గదిని, ఆర్టిసి బస్టాండ్ వద్ద పండ్ల, టీ దుకాణాలు తొలగించారు. ఈ సందర్భంగా సత్యన్నారాయణ మాట్లాడుతూ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకే ఆక్రమణలు తొలగించామన్నారు. నగరంలో ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ దుకాణాలను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నామని తమ దుకాణాలను అర్ధాంతరంగా తొలగించడం అన్యాయమని దుకాణదారులు అధికారుల ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. కార్యక్రమంలో టిపిఒ సీతారాం, టిపిఎస్ అప్పలరాజు, ప్లానింగ్ సెక్రటరీలు సింహాచలం, జీవన్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.