Nov 12,2020 19:05

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : చిత్తూరు జిల్లా నగరి, నారాయణవనం మండలాల్లో గతంలో చేనేత కార్మికులుగా ఉండి మరమగ్గం కార్మికులుగా మారిన వారి పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉందని, కొందరు బిచ్చగాళ్లుగా మారారని, వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని సిపిఎం కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు గురువారం సిఎంకు లేఖ రాశారు. ఈ ప్రాంతంలో 50 వేల మరమగ్గాలున్నాయని, సుమారు 20 వేల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నాయని తెలిపారు. గతంలో అమెరికా, జపాన్‌, దేశంలో వివిధ ప్రాంతాలకు ఏడాదికి రూ.100 కోట్లకుపైగా వస్త్రాలను ఉత్పత్తి చేసి ఎగుమతి చేసిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని వివరించారు. ప్రస్తుతం మరమగ్గాలు పనుల్లేక ఆగిపోయాయని, కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం ఈ ప్రాంత ప్రజలపై గణనీయంగా పడిందని తెలిపారు. ఎనిమిది నెలలుగా ఉత్పత్తులు నిలిచిపోయి కార్మికుల బతుకు దుర్భరంగా ఉందని, కుటుంబాలతో సహా పస్తులుండటం, పక్కనే ఉన్న చెన్నరు నగరానికి రోజు కూలీలుగా మట్టిపనికి, సెక్యూరిటీ గార్డులుగా, లిఫ్టు ఆపరేటర్లుగా వలస వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులకు అందిస్తున్నట్లుగానే ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం మరమగ్గం కార్మికులకూ అందించాలని కోరారు. మనిషికి పదికేజీల చొప్పున ఏడాదిపాటు బియ్యం, నిత్యావసర వస్తువులు ఆరు నెలలపాటు ఉచితంగా అందించాలని, ప్రతి కుటుంబానికీ నెలకు రూ.7500 చొప్పున ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు తరహాలో 750 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను మరమగ్గం కార్మికులకు అమలు పరచాలని, లాక్‌డౌన్‌ కాలానికి కరెంటు బిల్లులను పూర్తిగా రద్దు చేయాలని కోరారు.