
నెల్లిమర్ల: స్థానిక నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల జిల్లా పరిశీలకులు కాంతిలాల్‌దండే అధికారులకు సూచించారు. స్థానిక ఎంజెబిపి బిసి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల10న జరగనున్న నగర పంచాయతీ ఎన్నికల దృష్ట్యా, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దష్టి సారించి భద్రత ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహించాలని సూచించారు. అంతేకాకుండా స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్, డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా తగు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరం పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులను బోధన, అభ్యాసన విషయాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ మహేష్‌కుమార్, తహశీల్దార్ జి.రాము, నగర పంచాయతీ కమిషనర్ జె.రామఅప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.