Sep 05,2021 17:06

సినీతారలపై సామాజిక మాధ్యమాల్లో, సోషల్‌మీడియాలో నెగెటివ్‌ ప్రచారం, కామెంట్స్‌ సహజం. అయితే టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాల్లో బిజీగా ఉంటున్న నటి కియారాపై తాజాగా ఇలాంటి నెగెటివ్‌ ప్రచారమే జరిగింది. అయితే దీనిపై కియారా స్పందిస్తూ తనపై వచ్చే నెగెటివ్‌ ప్రచారం గురించి అస్సలు పట్టించుకోనని చెప్పింది. అసలు కియారాపై వచ్చిన ఆ నెగెటివ్‌ ప్రచారం ఏంటి? దీనిపై ఆమె ఏ విధంగా స్పందించింది.. వంటి విషయాలు తెలుసుకుందాం..!

పేరు : కియారా అద్వాణీ
అసలు పేరు : అలియా అద్వాణీ
పుట్టిన తేదీ : జులై 31, 1992
పుట్టిన ప్రాంతం : ముంబై
చదువు : మాస్‌ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేషన్‌
హాబీస్‌ : రాక్‌ క్లైంబింగ్‌
తల్లిదండ్రులు : జగ్దీప్‌ అద్వాణీ, జనీవీ జాఫ్రే
సోదరుడు : మిషాల్‌ అద్వాణీ


కియారా అసలు పేరు అలియా అద్వాణీ. అప్పటికే చిత్రసీమలో అలియా భట్‌ ఉండడంతో సల్మాన్‌ఖాన్‌ సూచనతో పేరు మార్చుకుంది. ఈ పేరు పెట్టుకోవడానికీ ఓ కథ ఉంది. 'అంజానా అంజానీ' చిత్రంలో ప్రియాంక చోప్రా కేరెక్టర్‌ పేరు కియారా. ఆ సినిమా చూశాక ఆ పేరు నచ్చడంతో అలియాను తీసేసి 'కియారా'ను తగిలించుకున్నానని అంటోంది. కబీర్‌ సదానంద్‌ తెరకెక్కించిన 'ఫగ్లీ'తో చిత్రసీమకు పరిచయమైంది కియారా. 'భరత్‌ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి అభిమానాన్ని సంపాదించుకుంది. తెలుగులో విజయం సాధించిన 'అర్జున్‌ రెడ్డి' ఆధారంగా హిందీలో తెరకెక్కిన 'కబీర్‌ సింగ్‌'లో కియారా స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సంపాదించింది. నెట్‌ఫ్లిక్స్‌ 'గిల్టీ'లోనూ ఆకట్టుకొనే నటనను ప్రదర్శించింది. అవకాశాలు వెల్లువెత్తుతున్నా కియారా మాత్రం ఆచి తూచి అడుగులేస్తూ తన మనసుకు నచ్చిన చిత్రాలనే ఎంపిక చేసుకుంటోంది.

నెగెటివ్‌ ప్రచారాన్ని పట్టించుకోను..!


అయితే తాజాగా తనపై సోషల్‌మీడియాలో వచ్చే నెగెటివ్‌ ప్రచారం నేపథ్యంలో ఆమె స్పందించింది. సోషల్‌మీడియాలో తనపై వచ్చే నెగెటివ్‌ ప్రచారం గురించి అస్సలు పట్టించుకోనని చెప్పింది కియారా. ప్రజల్లో విపరీతమైన ప్రాచుర్యం కలిగి ఉండే సినీ తారల పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవడం సహజమని.. వ్యతిరేక ప్రచారాన్ని కెరీర్‌లో ఓ భాగంగా స్వీకరిస్తానని పేర్కొంది. గతంలో తాను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్లుగా దుష్ప్రచారం చేశారని, అనుకున్న విధంగా ఫొటోలకు ఫోజులు ఇవ్వకపోడంతో తనపై అహంకారి అనే ముద్రవేసి ప్రచారం చేశారని, వివిధ సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతూ కామెంట్స్‌ పెట్టారని, అలాంటి వాటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం తనకు ఇష్టం ఉండదని, సెలబ్రిటీగా ఉన్నప్పుడు ఇలాంటి నెగెటివిటీని భరించక తప్పదని చెప్పుకొచ్చింది. 'అలాంటి వాటిని పట్టించుకుంటే కెరీర్‌ ప్రమాదంలో పడుతుంది. నేను నటించే ప్రతి సినిమా నాలోని నటిని ఓ కొత్త కోణంలో చూపెడుతోంది. మన దేశంలోని భిన్న సంస్కృతులు, వివిధ ప్రదేశాల ప్రజల జీవన విధానాలే రకరకాల పాత్రలకి ప్రాణం పోయడానికి కారణమవుతోంది. ఈ ప్రయాణాన్ని చాలా ఆస్వాదిస్తున్నా' అని అంటోంది కియారా. ఒకవేళ అహంకారమే ఉంటే సినిమా పరిశ్రమ అవకాశాలు ఇవ్వదని.. ఆ విషయం వార్తలు రాసిన వాళ్లకూ బాగా తెలుసని కౌంటర్‌ వేసింది.

నెగెటివ్‌ ప్రచారాన్ని పట్టించుకోను..!


కాగా ప్రస్తుతం బాలీవుడ్‌ బడా నిర్మాతలు కియారా డేట్స్‌ కోసం క్యూ కడుతున్నారు. తాజాగా రామ్‌చరణ్‌, మహేష్‌బాబు అప్‌ కమింగ్‌ మూవీస్‌తో పాటు పవన్‌కల్యాణ్‌, క్రిష్‌ సినిమాల్లో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అక్షరుకుమార్‌తో నటించిన 'భూల్‌ భులయ్యా 2'..విడుదలకు సిద్ధంగా ఉంది.