Apr 14,2021 21:54

అమరావతి బ్యూరో: రాష్ట్ర సముద్ర తీరంలో చేపల వేట నిషేధం నేటి నుండి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్‌ 15 నుండి జూన్‌ 14 వరకు 61రోజులపాటు ఈ నిషేధం కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు మర బోట్లకు (మెకనైజ్డ్‌, మోటరైజ్డ్‌) మాత్రమే అమలు జరిగిన వేట నిషేధాన్ని ఈ ఏడాది సాంప్రదాయ బోట్లకు కూడా అమలు చేయాలని మత్స్య శాఖ పూనుకోవడంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేట నిషేధ ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తప్పవని మత్స్యశాఖ కమిషనర్‌ కార్యాలయం నుండి వెలువడిన ప్రకటనతో తీర ప్రాంతంలో అలజడి మొదలైంది. ఇదిలా వుండగా నిషేధ కాలంలో గంగపుత్రులకు ప్రభుత్వం అందించే వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకం మే నెలలో అమలు కానుందని ముఖ్యమంత్రి విడుదల చేసిన కొత్త సంవత్సరం క్యాలెండర్‌లో పేర్కొన్నారు. మర బోట్లను నిషేధించినా తెప్పలను అనుమతించడంవల్ల మత్స్యకారులు తీరాన్ని ఆనుకొని వున్న సముద్రజలాల్లో చిన్న చేపలను పట్టుకొని పొట్ట గడుపుకునేవారు. ఇప్పుడు వాటినీ నిషేధించడంతో వారికి జీవనం కష్టమవుతుంది. అంతేగాక సముద్ర చేపలు పూర్తిగా దొరకని పరిస్థితి ఏర్పడితే వినియోగదార్లకూ ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా కరోనా సమయంలో చేపలు, మాంసం, గుడ్లు తినమని డాక్టర్లు చెబుతుంటే మత్స్య శాఖ చిన్న చేపలు కూడా మార్కెట్‌కు రాకుండా చేయడం దారుణమని వాపోతున్నారు. కాగా వేట నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్లలో సాంప్రదాయ బోట్లకు వేట నిషేధం వర్తించదని స్పష్టంగా పేర్కొనగా మత్స్య శాఖ కమిషనర్‌ వాటినీ నిషేధ జాబితాలో ఎలా చేర్చుతారని ప్రశ్నిస్తున్నారు. అటు మత్స్యకార్లకు, ఇటు వినియోగదార్లకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
                                          1.23లక్షల మందికి పథకం వర్తింపు
వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకంతో ఈ సంవత్సరం సుమారు 1.23లక్షల మందికి పైబడి ఈ సంవత్సరం లబ్ధి చేకూరనుంది. దీనికి సంబంధించిన గణాంకాలు, వివరాలు సేకరణ, విచారణ, బడ్జెట్‌ రూపకల్పన వంటి పనులన్నీ దాదాపు పూర్తయినట్లు సమాచారం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.102.478కోట్ల బడ్జెట్‌తో ఈ పథకం ద్వారా 1,02,478 మందికి రూ.10వేలు చొప్పున లబ్ధి చేకూరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,09,231 మంది లబ్ధి పొందారు. 2021-22 ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం 6,694 సాంప్రదాయక(యాంత్రాలు లేని) బోట్లు, 1,639 మెకనైజ్డ్‌ బోట్లు, 20,834 మోటరైజ్డ్‌ బోట్లలో పని చేస్తున్న సుమారు 1.23లక్షల మందికి పైబడి పథకం ద్వారా లబ్ధి పొందేందుకు మత్స్యశాఖ అధికారులు తుది జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగమయ్యారు. దీనికి గాను రూ.122.962కోట్లు ఖర్చవుతుంది. వేట నిషేధంవల్ల చేపల అమ్మకం, నిల్వ, రవాణా రంగాల్లో ఉపాధి కోల్పోయే వారినీ ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
                                              1,995 మందికి అందని పరిహారం..
మత్స్యకార భరోసా పథకం మెకనైజ్డ్‌ బోట్‌కు 8మంది, మోటరైజ్డ్‌ బోట్‌కు ఆరుగురు, నాన్‌ మోటరైజ్డ్‌(సాంప్రదాయక బోట్‌)కు ముగ్గురు చొప్పున వర్తిస్తుంది. 2020-21లో ఈ పథకం డబ్బులు కొంత మందికి ఇంకా అందలేదు. లబ్ధిదారులు నేటికీ బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై భృతి అందని వారు తమ సమస్యలను ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 70, విశాఖజిల్లాలో 1,200, గుంటూరు జిల్లాలో 250, కృష్ణా జిల్లాలో 195, తూర్పుగోదావరి జిల్లాలో 200,, విజయనగరం జిల్లాలో 80మంది నేటికీ పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు.