Jan 26,2021 07:40

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దళపతి నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ దేశభక్తికి చెరగని చిరునామా. సామ్రాజ్యవాదంపై పోరాటమే దేశానికి నిజమైన స్వాతంత్య్రం అని, ప్రపంచానికి అసలు సిసలు విముక్తి అని ఎలుగెత్తిన ధీరుడు. అటువంటి చారిత్రక యుగ పురుషుడిని సైతం రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడటం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, బిజెపిల దిగజారుడు, దివాళాకోరుతనానికి పరాకాష్ట. ఇంతకాలం నేతాజీని ఉద్దేశపూర్వకంగా వివాదాల్లోకి లాగి పబ్బం గడుపుకున్న బిజెపికి హఠాత్తుగా ఆయనపై వల్లమాలిన ప్రేమ, గౌరవం పుట్టడానికి హేతువు త్వరలో జరగనున్న పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలేననడం నిస్సందేహం. సరిగ్గా ఇప్పుడే వచ్చిన నేతాజీ 125వ జయంతిని రాజకీయాలకు వాడుకునేందుకు ఏకంగా ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ప్రయాణం కట్టి నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా పాకిస్తాన్‌, చైనా, జమ్మూకాశ్మీర్‌, వాస్తవాధీనరేఖ, నియంత్రణ రేఖలని ఏవేవో చెప్పి, నేతాజీ వారసులం తామేనని అబద్ధాలు, అవాస్తవాలను వండి వార్చారు. సామ్రాజ్యవాద బ్రిటిషర్ల నుంచి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలని సుభాస్‌ చంద్రబోస్‌ వాంఛించగా, అనాడు స్వాతంత్య్రోద్యమానికి దూరంగా ఉన్న నాటి మోడీ వారసులైన హిందూ మహాసభ నాయకులు, బ్రిటిష్‌ ప్రభుత్వానికి అప్రూవర్లుగా మారారన్నది చెరపజాలని చరిత్ర. ఆ వాస్తవాలను చెరిపేసేందుకు, మసిపూసి మారేడుకాయ చేసేందుకు సందు చిక్కినప్పుడల్లా వక్ర వ్యాఖ్యానాలు, అసంబద్ధ తర్కాలతో బరి తెగించడం బిజెపికి అలవాటైపోయింది. ఆ కోవలోనిదే ఈ నేతాజీ వ్యవహారం.
మోడీ, ఆయన పార్టీ నేతాజీకి ఏ విధంగా వారసులవుతారో మానవ మెదళ్లకు అంతు చిక్కదు. నేతాజీ సామ్రాజ్యవాదంపై సమరశంఖాన్ని పూరించగా, బిజెపి ప్రభుత్వం అదే సామ్రాజ్యవాదాన్ని, దాని మానసపుత్రికలైన నయా-ఉదార విధానాలను నెత్తికెత్తుకుంది. అన్ని రంగాల్లో దేశం స్వయంసమృద్ధి సాధించాలని బోస్‌ కలలు కనగా, మోడీ సర్కారు మన సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది. ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికాకు ఏ విధంగా బిజెపి ప్రభుత్వం సాగిలపడిందో, ట్రంప్‌ వంటి దేశాధినేతకు సైతం జీహుజూర్‌ అన్నదో లోకానికి తెలిసిందే. నేతాజీ జీవితాన్ని ఆసాంతం పరిశీలిస్తే ఆయన మతోన్మాదానికి బద్ధ వ్యతిరేకి. నేతాజీవి విశాల భావాలు తప్ప సంకుచిత భావాలు కావు. కాగా బిజెపి తన సహజసిద్ధ ఏకరూప సిద్ధాంతానికి, హిందూ మతోన్మాద భావజాల వ్యాప్తికి కంకణం కట్టుకొని, నేతాజీ వారసత్వాన్ని తగిలించుకోవడం ప్రజలను వంచించడం తప్ప మరేం కాదు. తమ మతోన్మాద ఎజెండాకు ఎదురొడ్డి పోరాడుతున్న వామపక్షాలపై తాడూ బొంగరం లేని ఆరోపణలు చేయడమూ అంతే.
నేతాజీనే కాదు ఎవ్వరినైనా తన రాజకీయాలకు ఉపయోగ పెట్టుకునే బరితెగింపు బిజెపికే సాధ్యం. జాతిపిత మహాత్మాగాంధీ పరమత సహనాన్ని కాంక్షించడం ఇష్టంలేక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త గాడ్సే గాంధీని హత్య చేశాడు. గాడ్సే తమ ఆరాధ్య దైవం అని పలు సందర్భాల్లో బిజెపి నేతలు ప్రకటించారు. కాలక్రమంలో రాజకీయ లబ్ధి కోసం గాంధీని తమ పక్షంలో చేర్చుకొని 'స్వచ్ఛ భారత్‌' వంటి గావు కేకలు పెట్టడం ఆ పార్టీకే చెల్లింది. భారత యూనియన్‌ను వల్లభారు పటేల్‌ కోరుకోగా దేశాన్ని వీలైనంతగా చిన్న రాష్ట్రాలుగా ముక్కలు చేయాలనే బిజెపి, అదే నోటితో పటేల్‌కు జైకొట్టడం ద్వంద్వనీతి. ఆచరణలో సోషలిజాన్ని కాంక్షించిన భగత్‌సింగ్‌నూ బిజెపి వదిలిపెట్టలేదు. బెంగాల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మొన్న జరిగిన స్వామి వివేకానంద 158వ జయంతిని సైతం రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేసింది. బెంగాల్‌లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సైతం నేతాజీ, వివేకానంద లను స్వంత రాజకీయాలకు వాడుకోవడంలో ఏ మాత్రం తక్కువ తినలేదు. హఠాత్తుగా నేతాజీ పుట్టిన రోజును బిజెపి 'పరాక్రమ్‌ దివస్‌' అన్నా, మమతా 'దేశీయ నాయక్‌ దివస్‌' అన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించడానికే. బెంగాల్‌ ప్రజలు చైతన్యానికి ప్రతీక. ఇలాంటి చౌకబారు రాజకీయాలకు మద్దతు పలకరు. దేశ ప్రజలూ విశ్వసించరు.