Nov 20,2020 19:24

ఈ సమాజంలో తామూ అందరిలానే గౌరవంగా బతకాలని భావిస్తున్నారు. కానీ, తమ పూర్వికులు గతంలో చేసిన నేరాలు, ఘోరాల కారణంగా నేటికీ తమని నేరగాళ్లలాగే పరిగణిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొందరు తమ కుటుంబాలకు దూరమయ్యారు. మరి కొందరు తమ బిడ్డల్ని తమకు దూరంగా పంపించి బతుకుల్ని కొనసాగిస్తున్నారు. ఇంకొందరు తమ జీవితాలకే దూరమయ్యారు. నేరం ఎవరిది? శిక్ష ఎవరికి?
          పుడుతూనే ఎవరూ నేరస్తులు కారు. అందరిలాగానే అందరూ గౌరవంగా బతకాలని కోరుకుంటారు. కానీ, పరిస్థితులు అలా లేకపోతే ఆ తప్పెవరిది? ఒక నేరముద్ర బడుగు కుటుంబాలను ఎలా అతలాకుతలం చేస్తుందో చెప్పటానికి ఈ కింది ఉదంతాలు ఉదాహరణగా నిలుస్తాయి. సంబంధిత వ్యక్తులను ఇటీవల 'జీవన' కలిసి మాట్లాడింది. ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ.. ఆ వెతలను మీరే వినండి.

నేరం ఎవరిది? శిక్ష ఎవరికి?


పేగుబంధం తెంచుకొంది!
          ఏ తల్లి అయినా తన బిడ్డను తన కళ్లముందు ఉండాలని కోరుకుంటుంది. ఆ చిన్నారికి నీళ్లుపోసి, జోల పాడి తన ఒడిలో నిద్రపుచ్చాలనుకుంటుంది. నడకా నడత నేర్పి, చదువు చెప్పించి... ప్రయోజకుడైతే సంతోషిస్తుంది. కాని, తమ కుంటుంబానికున్న నేరచరిత్ర తన బిడ్డపై పడి ఎక్కడ జీవిత కాలం నీడలా వెంటాడుతుందోనని భావించింది ఓ మాతృమూర్తి. మణి (46) తండ్రి, భర్త ఇద్దరూ దొంగతనాలు చేసుకుని బతికేవారు. పేరు మోసిన గ్యాంగులతో సంబంధాలుడేవి. అందుకోసం నెలలు తరబడి ఇంటిని విడిచి వాళ్లతోనే తిరిగేవారు. ఈ పని ఏ మాత్రం మణికి నచ్చేది కాదు. దొంగతనాలు మాని గౌరవమైన పని చేసుకుని బతకాలని పదే పదే చెప్పేది. ఆమె మాట ఏమాత్రం వినేవాళ్లు కాదు. తన పుట్టబోయే బిడ్డ కూడా వీరిలానే తయారవుతాడని భయపడింది. అలా జరగకూడదనిమూడు నెలల నిండని ఆ పసికందునిమూడో కంటికి తెలీకుండా దూరంగా ఉంచింది. తప్పని పరిస్థితుల్లో బిడ్డను అనాధాశ్రమంలో ఒదిలేసింది. ఆ చిన్నారి భవిష్యత్తు అయినా బాగుండాలని ఆమె పేగుబంధాన్ని తెంచుకొంది.
 

నేరం ఎవరిది? శిక్ష ఎవరికి?

హీనంగా చూస్తారు
          ఈ వ్యథను రాజ్యం (29) అనే మహిళ చెబుతోంది. తన మాటల్లోనే వినండి... : 'నా పేరు రాజ్యం. మా తాత లారీ డ్రైవర్‌గా ఉండేవాడు. యజమాని ఇచ్చిన అప్పగించిన అక్రమ సరుకును దించేందుకు వెళ్లేవాడు. ఆ వెళ్లే క్రమంలో ఎన్నోసార్లు పోలీసులకు పట్టుబడి... జైలుకెళ్లాడు. నేరగాడనే ముద్ర పడడంతోఉన్న ఊరినీ... కన్నవారినీ విడిచిపెట్టి కృష్ణా జిల్లాకు వచ్చి స్థిరపడ్డాడు. కృష్ణా నది ఒడ్డున గుడిసె వేసుకుని ఉంటూ... కూలి పనులకు వెళ్లేవాడు. కానీ, పోలీసు కేసులు అతన్ని వెంటాడటంతో... తానో నేరగాడిగానే ఉండిపోవాల్సి వచ్చింది. ఒక్కోసారి రెండేళ్లు, ఐదేళ్లు జైల్లో ఉండేవాడు. మా తాతది ఏ ఊరు? మా నాన్న ఏం చేస్తుంటాడు? వంటి విషయాలు మా అమ్మ నాకు ఎప్పుడూ చెప్పలేదు. మా నాన్నని కూడా అప్పుడప్పుడే చూసేదాన్ని. నా పదమూడేళ్లు వయసులో మా అమ్మని పోలీసులు తీసుకెళ్లారు. ఇంట్లో నేనూ, మా తాతే ఉండేవాళ్లం. అమ్మానాన్నల గురించి అడిగితే... వారు జైలు కెళ్లారని చెప్పాడు తాత. ఎంత అడిగినా అంతకు మించి వివరాలు చెప్పేవాడు కాదు. నేను ఇల్లు దాటి బయటకు వెళ్తే... నన్ను ఎంతో హీనంగా చూసేవారు. చుట్టుపక్కల ఎవరింట్లో ఏది పోయినా మమ్మల్నే అనుమానించేవారు. మా బతుకులు ఎందుకు ఇలా మారాయో తెలీదు. ఆరేళ్ల తర్వాత అమ్మ జైలు నుంచి తిరిగి వచ్చింది. కొంత డబ్బు తెచ్చింది. కడుపు నింపుకోవడం కోసం ఓ చిన్న బండి పెట్టుకుని సాయంత్ర వేళలో పకోడి, బజ్జీలు వేసుకుని జీవనం సాగిస్తున్నాం. ఇప్పటికీ ఎన్నో అవమానాలు భరిస్తూనే ఉన్నాం. అసలు నేను చేసిన నేరమేంటి?''

నేరం ఎవరిది? శిక్ష ఎవరికి?


ఒంటరి బతుకులు
          ఆళ్లప్ప (54) స్వస్థలం నూజివీడు. పదమూడేళ్ల వయసులో చెడు స్నేహాలకు అలవాటు పడి... గ్రూప్‌తో కలిసి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అలా తనపై దొంగ అనే ముద్ర వేయించుకుని చిన్నతనంలోనే శిక్షను అనుభవించాడు. దాంతో, ఇంటి నుంచి నెట్టివేయబడ్డాడు. కృష్ణా జిల్లా వచ్చాక మరిన్ని గ్రూపులతో సావాసం పెరిగి, దొంగతనాలు కొనసాగించాడు. తరచూ జైలుకి వెళ్లస్తుండేవాడు. బంగారం షాపులో దొంగతనం కేసులో ఎక్కువకాలం జైల్లో ఉన్నాడు. ఆ సమయంలో జైలు అధికారి జోక్యంతో అతడి ఆలోచనల్లో మార్పు వచ్చింది. జైల్లో పనిచేసినందుకు గాను వచ్చిన కొంత డబ్బుతో కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు. ఆ క్రమంలో పరిచయమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లపాటు వారి జీవితం సంతోషంగా సాగింది. వారికి ఒక పాప పుట్టింది.
       ఆ ప్రాంతంలో జరిగిన ఓ హత్య కేసులో ఆళ్లప్పను పోలీసులు తీసుకెళ్లారు. ఆ నేరాన్ని ఒప్పుకుంటే... కుటుంబానికి ఎటువంటి హానీ ఉండదని, వారికి కొంత డబ్బు ఇస్తామని బలవంతంగా ఒప్పించారు. ఆళ్లప్పకు యావజ్జీవ శిక్ష పడింది. భార్య బిడ్డ ఒంటరివారయ్యారు. ఆమె ఎప్పటిలానే కూరగాయలు అమ్ముకునే ప్రయత్నం చేసినా.. చుట్టుపక్కల వారి మాటలు మానసికంగా కుంగదీశాయి. దీంతో, అక్కడ నుంచి ఎక్కడికో వెళ్లిపోయింది. మొదటి రెండేళ్లు ఆళ్లప్ప కోసం కూతుర్ని తీసుకుని జైలుకు వెళ్లేది. తర్వాత మానేసింది. గతేడాది శిక్ష పూర్తయిన ఆళ్లప్ప జైలు నుంచి తిరిగొచ్చాడు. భార్యాపిల్లలు ఏమయ్యారో కూడా తెలీక దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా మిగిలిపోయాడు.
       తెలిసో తెలియకో కొందరు, తప్పని పరిస్థితుల్లో కొందరు సమాజంలో నేరాలకు పాల్పడుతున్నారు. కొన్నాళ్ల తరువాత మారాలని ప్రయత్నం చేస్తున్నా కొందరు అవమానాలకు గురవుతూనే ఉన్నారు. ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డల్ని తమలాగే నేరగాళ్లుగా చూడాలని అనుకోరు. కాని, నేటికీ తాతలు, తండ్రులు చేసిన నేరాలకు బిడ్డలు బలైపోతున్నారు. వారికి సమజమూ, ప్రభుత్వమూ చదువు, భద్రత అందేలా చేస్తే... ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆ దిశగా అందరూ ఆలోచించాలి.

                                                                                                                                  -  వర్థని