Nov 30,2020 21:50

మాట్లాడుతున్న ఎస్‌ఐ రాము

ప్రజాశక్తి - శ్రీకాకుళం సిటీ : ఇటీవల నగరంలో వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒకటో పట్టణ ఎస్‌ఐ కె.రాము అన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సోమవారం ఆటోల్లో మైకులతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ప్రచారంలో భాగంగా ఎస్‌ఐ మాట్లాడుతూ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆటోలతో ప్రచారం చేస్తున్నామన్నారు. ప్రజలు తమ సొంత గ్రామాలు, తీర్థయాత్రలకు వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ విధానంతో ఇంట్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందన్నారు. నగలు, విలువైన ఆభరణాలు ధరించి వివాహాలు, ఇతర శుభకార్యాలకు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వారికి సంబంధించి నగదు, ఆభరణాలు తదితర వాటిని లాకర్లలో భద్రపర్చుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడినప్పుడు సంబంధిత పోలీస్‌స్టేషన్‌, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. నేరాల నివారణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎఎస్‌ఐ కె.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.