Sep 15,2021 16:07

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో క్రైమ్‌ రేటు అమాంతం పెరిగింది. దేశంలో అత్యధిక నేర రేటు కలిగిన ఏడవ రాష్ట్రంగా ఎపి అవతరించింది. జాతీయ నేర రికార్డ్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదికలో ఈ విషయాలు వెలుగుచూశాయి. ఈ నివేదిక ప్రకారం 2020లో రాష్ట్రంలో మొత్తంగా నేర రేటు 63 శాతం పెరిగింది. మొత్తంగా ఎపిలో 2,38,105 నేరాలు జరగ్గా.. ఐపిసి కింద నమోదైన కేసులు 1,88,997. 2019తో పోలిస్తే ఈ ఐపిసి కింద నమోదైన కేసులు 58 శాతం అదనం. 2020లో స్పెషల్‌ అండ్‌ లోకల్‌ లాస్‌(ఎస్‌ఎల్‌ఎల్‌) కింద రిజిస్టరైన నేరాలు 49,108. అయితే 2019తో పోలిస్తే దీని కింద నమోదైన కేసుల పెరుగుదల 85 శాతం. అయితే ఇందులో ఊహించిన విధంగా మహిళలపై జరుగుతున్న నేర రేటు కొంచెంగా తగ్గుముఖం పట్టిందని నివేదిక చెబుతోంది. 2020లో 17,089 కేసులు నమోదు కాగా, 2019లో 17,746 నేరాలు నమోదయ్యాయి. 2020లో 587 మంది చిన్నారులతో పాటు 1,192 మందిపై మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. అదే సమయంలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు 2020 కొంచెం పెరిగాయి. 2019లో 2,524 కేసులు నమోదు కాగా, 2020లో 2,648 కేసులు రికార్డు అయ్యాయి. గత ఏడాదితో పోల్చుకుంటే (2019-870)... 2020లో హత్య కేసుల సంఖ్య కాస్త (853) తగ్గాయి.
ఎన్‌సిఆర్‌బి డేటా ప్రకారం.. 391 హత్య కేసులు... ఆస్తులు, కుటుంబ తగాదాలు, నగదు, నీటికి సంబంధించిన వివాదాల కారణంగా నమోదు కాగా, 168 హత్య కేసులు అక్రమ సంబంధాల వల్ల చోటుచేసుకున్నాయి. 59 కేసులు వ్యక్తిగత ప్రతీకారం, శత్రుత్వం కింద నమోదయ్యాయి. మహిళల్లో జరుగుతున్న సాధారణ నేరాల్లో అత్యధికంగా వరకట్న, భర్త వేధింపులున్నాయి. అత్యాచారం తర్వాత మహిళలపై జరుగుతున్న సాధారణ నేరాల్లో రెండవది లైంగిక వేధింపులు. ఇక 2020లో ఎపిలో షెడ్యూల్‌ తెగలు, షెడ్యూల్‌ వర్గాలపై జరిగిన నేరాలు స్వల్పంగా తగ్గాయి. 2020లో ఎస్‌సి వర్గాలపౖౖె జరిగిన నేరాల సంఖ్య 1,950 ఉండగా.. 2019లో 2,071 కేసులు నమోదయ్యాయి. ఇక ఎస్‌టి వర్గాలపై జరిగిన నేరాలు 2020లో తగ్గుముఖం పట్టాయి. 2019లో 330 ఉండగా.. 2020లో 320 కేసులు నమోదయ్యాయి. ఎస్‌సి, ఎస్‌టిపై అఘాయిత్యాల నిరోధక చట్టాన్ని అమలు చేయడంతోనే నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని దళిత కార్యకర్త కె. వెంకట రమణ అన్నారు.