Oct 03,2020 23:35
నేను సరే.. మీ బాధేంటి?!

టీనేజ్‌లోనే వయసుకు మించిన పాపులారిటి సంపాదించింది సుహానా ఖాన్‌. దీనికి తండ్రి షారుక్‌ఖాన్‌ సూపర్‌ సెలబ్రిటీ హోదా మాత్రమే కారణం కాదు. తన సొంత అభిప్రాయాలను సూటిగా చెప్పడం. 'ఎవరేమనుకున్నా బోల్డ్‌గా ఉండటమే నా స్టయిల్‌!' అనే తరహా ప్రవర్తనతో అందరి దృష్టినీ ఆకర్షించింది. బాలీవుడ్‌ పిల్లల సర్కిల్‌లో పార్టీ గార్ల్‌గానే కాదు పాపులర్‌ గార్ల్‌గా ఎదిగింది. తాజాగా చిన్ననాటి నుంచి తన శరీర ఛాయ గురించి తాను ఎదుర్కొన్న 'హేట్‌ మెసేజ్‌'ల గురించి బహిరంగంగానే దులిపేసింది!

ఈ సమాజంలో కుల, మత, వర్గ విభేదాలతో పాటు శరీర ఛాయపై ద్వేషపూరితంగా మాట్లాడటం పరిపాటి. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా దీనికి అతీతులుకాదు. ఇరవై ఏళ్ల సుహానా తన 12వ ఏట నుంచి తాను ఎదుర్కొన్న వివక్షపై ఇప్పుడు సామాజిక వేదికపై బహిరంగంగా మాట్లాడింది. తనను బాధించిన కామెంట్లనూ ప్రస్తావించింది. ''ఆమె నల్లగా ఉండటమే కాదు అసహ్యంగా ఉంటుంది.. 'నల్ల రాక్షసి'.. 'నల్ల పిల్లి'..'' అంటూ తనను కామెంట్‌ చేసేవారంటూ అక్కడ పేర్కొంది. విచిత్రమైన విషయం ఏమంటే ఇలాంటి కామెంట్లన్నీ ఎక్కువగా పెద్ద వయసు వారి నుంచే రావడం! అంతేనా, వీళ్లంతా భారతీయులే కావడం మరో విశేషం.


మీరూ అంతే ఉండండి!
''ప్రస్తుతం ఎన్నో విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో శరీరఛాయ ఒకటి. ఇది నా ఒక్కదాని గురించే కాదు. దేశంలో ఎంతోమంది ఎదుగుతున్న యువత ఎదుర్కొంటున్న హింస. వీరంతా ఎలాంటి కారణం లేకుండానే 'మేము తక్కువ'వారమనే భావనలో బతకాల్సి రావడం చాలా దారుణం. నా శరీరఛాయను బట్టి నేను అసహ్యంగా కనిపిస్తున్నానని అనడం అమానవీయం. భారతీయులు గోధుమవర్ణం కలిగినవారు. ఇక్కడ అన్ని రంగుల శరీరఛాయలు ఉన్నవారున్నారు. మనల్ని మనమే అసహ్యించుకోవడం అనేది మనం అభద్రతలో బతుకుతున్నామని తెలియజేస్తుంది. మన సామాజిక మాధ్యమాలు, భారతీయ వివాహ వేదికలు, లేదంటే సొంత కుటుంబాలే మనల్ని ఇలా తయారుచేస్తుంటే...5.7 అంగుళాలు పొడవు, తెల్లని శరీరఛాయ లేకపోతే 'అందం'గా ఉండనట్లేనని మీకు నేర్పుతుంటే... మీ విషయంలో నేను చింతిస్తున్నాను. అవును, నేను 5.3 అంగుళాలే, నా శరీరం గోధుమ వర్ణమే... దీనివల్ల నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. మీరు కూడా అలాగే ఉండండి!'' అంటూ సుహానా చేసిన పోస్ట్‌ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఎంతో మంది అభిమానాన్ని పొందింది.


పేరు: సుహానాఖాన్‌
తండ్రి : షారూఖ్‌ఖాన్‌ (బాలీవుడ్‌ స్టార్‌ హీరో)
తల్లి : గౌరీఖాన్‌
పుట్టింది : 22 మే, 2000


ఇష్టాలు : చిన్ననాటి నుంచి క్రీడలంటే అమితమైన ఇష్టం. ఇప్పటివరకూ ఒక్క ఐపిఎల్‌నూ మిస్‌ కాలేదు. అన్నింటిలోనూ ఫుట్‌బాల్‌ అంటే ఆమెకు అత్యంత ఇష్టం. స్కూల్‌ ఫుట్‌బాల్‌ జట్టులో అండర్‌-14 గార్ల్స్‌ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రీడల్లోనే కాదు డ్యాన్స్‌, మ్యూజిక్‌ వంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ అంశాల్లో చాలా యాక్టివ్‌గా ఉండేది. సుహానా కథారచనలోనూ ప్రతిభను చాటుకుంది. 'కథ నేషనల్‌ స్టోరీ రైటింగ్‌' పోటీల్లో ఉత్తమ బహుమతిని అందుకుంది.


భిన్న కోణం : సుహానా ప్రస్తుతం మోడల్‌గా రాణిస్తోంది. ఈ వృత్తిలో ఎక్కువ సమయం కెమెరా ముందే ఉండాల్సి ఉంటుంది. అయితే ఈమెకు 'కెమెరా షై' ఉండటం వల్ల ఫొటోలంటే పెద్దగా ఇష్టం ఉండకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే.


ప్రత్యేక కోణం : చిన్ననాటి నుంచే తండ్రి షారుక్‌ఖాన్‌తో కలిసి మీడియాకు పరిచయమవ్వడం. తద్వారా చాలా మంది సెలబ్రిటీ తనయల కంటే కాస్త పాపులారిటీ ఎక్కువగానే సంపాదించుకుంది. అంతకుమించి సామాజిక అంశాల పట్ల, ముఖ్యంగా మతం, మహిళలకు సంబంధించిన విషయాల్లో స్వీయ అభిప్రాయాలతో సామాజిక మాధ్యమాలు వేదికగా తన గొంతు వినిపిస్తోంది.


నటన : థియోడర్‌ జిమెనో దర్శకత్వం వహించిన 'ది గ్రే పార్ట్‌ ఆఫ్‌ బ్లూ' అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించింది.


చదువు : ఇంగ్లాండ్‌లోని ఆర్డింగ్లీ కాలేజ్‌లో ఫిల్మ్‌ కోర్సు పూర్తిచేసింది. ప్రస్తుతం న్యూయార్క్‌ యూనివర్సిటీలో చదువుతోంది.