Mar 02,2021 22:58

పొదిలి నగర పంచాయతీ కార్యాలయం ఇదే

ప్రజశక్తి-పొదిలి : పొదిలి మేజర్‌ పంచాయతీని నగర పంచాయతీగా మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ కంభాలపాడు, మాదాలవారిపాలెం, నందిపాలెం గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై గత నెల 12న హైకోర్టులో వాదనలు జరిగాయి. రాష్ట్రం మొత్తం మీద వివిధ విలీన గ్రామ పంచాయతీల సమస్యలపై వాదనలు విన్న హైకోర్టు తుది తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. పొదిలి పంచాయతీలో సుమారు 32 వేల జనాభా ఉంది. 24 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో పొదిలి మేజర్‌ పంచాయతీని నగర పంచాయతీగా మార్చేందుకు గత ఏడాది పైగా చర్చ జరిగింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది కరోనాకు ముందు చేసిన ప్రయత్నాలు వాయిదా పడ్డాయి. కరోనా సమయంలో ప్రత్యేక అధికారులతో పంచాయతీ తీర్మాణాలు చేసిన అధికారులు హడావిడిగా కంభాలపాడు, నందిపాలెం, మాదాలవారిపాలెం గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ఇచ్చిన అధికారిక ప్రకటన ఈ గ్రామాల ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించింది. పొదిలి మేజర్‌ పంచాయతీతో పాటు మిగిలిని మూడు పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంథీ జాతీయ ఉపాధి హమీ పథకం అమలులో ఉంది. నగర పంచాయతీ మార్పుతో ఆ పథకం రద్దు అయ్యింది. అంతే కాక ఆయా గ్రామాల ప్రజలకు పన్నులు అదనపు భారం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా సమావేశమై కోర్టులో రిట్‌ పిటీషన్‌ వేశారు. గత నెల 12న హైకోర్టులో చీఫ్‌ జస్టిస్‌ ఎకె.గోస్వామి మరియు జస్టిస్‌ పవన్‌ కుమార్‌ విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బుధవారం రానున్న తీర్పుతో ' పొదిలి నగర పంచాయతీ ' ఎలాంటి మలు పులు తిరుగుతుందోనని పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.