Feb 12,2021 23:31

ఫొటో : ఎన్నికల విధులకు వెళ్తున్న సిబ్బంది

- సామగ్రితో చేరిన సిబ్బంది
- 150 మందిపై సస్పెన్షన్‌ వేటు
- ప్రశాంత పోలింగ్‌కు చర్యలు
- జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ వీరపాండ్యన్‌
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్‌:
 పంచాయతీ ఎన్నికల రెండో విడత చివరి ఘట్టానికి చేరుకుంది. శనివారం ఉదయం 6.30 నుంచి 3.30 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌, కౌంటింగ్‌ నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. సిబ్బంది ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రితో చేరుకున్నారు. పోలింగ్‌ మెటీరియల్‌ను ప్రత్యేక వాహనాల్లో కేంద్రాలకు తరలించారు. మొదటి విడతలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రెండో విడతపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. రెండో విడత పోలింగ్‌ విధులకు హాజరు కావాల్సి ఉన్న రికార్డింగ్‌ ఆఫీసర్స్‌, పోలింగ్‌ ఆఫీసర్‌, సూక్ష్మ పరిశీలకులు వంటి వారిని 50 మందిపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులను జారీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ వీరపాండ్యన్‌, ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్పలు కేంద్రాలకు పోలింగ్‌ సామగ్రి తరలింపుపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.
పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జి.వీరపాండ్యన్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో పోలింగ్‌ ఏర్పాట్లపై కలెక్టర్‌ వీరపాండ్యన్‌, ఎస్పీ ఫక్కీరప్ప, జెసిలు రామ్‌సుందర్‌ రెడ్డి, సయ్యద్‌ ఖాజా మోహిద్దీన్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 13 మండలాల్లోని 240 పంచాయతీల్లో సర్పంచి స్థానాలకు, 2,482 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికే 57 సర్పంచి స్థానాలు, 933 వార్డు మెంబర్ల స్థానాలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. 183 పంచాయతీల్లో సర్పంచి, వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. సర్పంచి స్థానాలకు 519 మంది, వార్డు మెంబర్ల స్థానాలకు 3,496 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోలింగ్‌కు బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లను డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు తరలించామని తెలిపారు. స్టేజ్‌ -2 ఆర్‌ఒలు 240, జోనల్‌ ఆఫీసర్లు 53, రూట్‌ ఆఫీసర్లు 85, వీడియోగ్రాఫర్లు 97, వెబ్‌ కాస్టింగ్‌ 77 పోలింగ్‌ కేంద్రాల్లో, సూక్ష్మ పరిశీలకులు 92 మంది ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహిస్తారని చెప్పారు. 309 కేంద్రాలను అత్యంత సమస్యాత్మక, 582 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామని తెలిపారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం సాయంత్రం 4 నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. అనంతరం ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తామన్నారు. అదేరోజు ఉప సర్పంచి ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమాచార పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు నాయకుడు, మల్లికార్జునుడు, డిపిఒ కెఎల్‌.ప్రభాకర్‌, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పి.జయరావు పాల్గొన్నారు.