
న్యూఢిల్లీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు మరో చరిత్ర సష్టించబోతున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడున రైతులు లక్షలాది ట్రాక్టర్లతో '' కిసాన్ రిపబ్లిక్ పరేడ్'' నిర్వహించనున్నారు. ఇందుకు దేశ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా పోరాటం చేస్తున్న రైతులు సిద్ధమయ్యారు. పరేడ్ సజావుగా, విజయవతంగా సాగేందుకు రైతు సంఘాలు మార్గదర్శకాలు, సూచనలు విడుదల చేశారు. పరేడ్ సమయంలో గందరగోళం పడొద్దని, సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందితో పంచుకోవాలని సూచించింది.
మీడియా సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) నేతలు మాట్లాడుతూ ట్రాక్టర్ల పరేడ్ ద్వారా రైతులు చరిత్ర సష్టించబోతున్నారని, చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమం జరనుందన్నారు. ఈ పరేడ్ ద్వారా రైతుల దుస్థితి, డిమాండ్ల గురించి దేశానికి, ప్రపంచానికి చెప్పబోతున్నామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరేడ్ నిర్వహిస్తామని, తమ లక్ష్యం కేంద్ర ప్రభుత్వాన్ని కదలించడంతో పాటు, దేశంలోని కోట్లాది మంది ప్రజల హదయాలను గెలవడమని అన్నారు. ట్రాక్టర్లపై రైతు సంఘాల జెండాలతో పాటు జాతీయ జెండాలను ఉంచాలని సూచించారు. పరేడ్‌పై పుకార్లను నమ్మొద్దని, ఏమైనా గందరగోళం ఉంటే ఆయా రైతు సంఘాల నాయకులను సంప్రదించాలని, 7428384230కు కాల్ చేయాలని సూచించారు.
ఆరు రూట్లల్లో కిసాన్ పరేడ్
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడున రైతులు తలపెట్టిన కిసాన్ పరేడ్‌కు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ పరేడ్‌కు ఆరు సరిహద్దు ప్రాంతాల నుంచి రూట్లు నిర్ణయించారు. అందులో మూడు పెద్దవి, మూడు చిన్నవి ఉన్నాయి. సింఘు బోర్డర్ నుంచి కహర్ హొడా టోల్ ప్లాజా వరకు మొత్తం 63 కిలోమీటర్ల ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే టిక్రి నుంచి అసోడా టోల్ ప్లాజా వరకు మొత్తం 62.5 కిలో మీటర్లు, ఘాజీపూర్ నుంచి ఘాజీపూర్ సరిహద్దు వరకు 68 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ ర్యాలీ జరగనుంది. ఇంకా షాజహాన్‌పూర్ సరిహద్దు, జూర్హేడా బోర్డర్ నుంచి చిల్లా బోర్డర్ రూట్లో సాగి మళ్లీ ఆయా స్థానాలకు చేరుకుంటాయి.
సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దు మార్గాల్లో దాదాపు 300 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ పరేడ్ కొనసాగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకల అనంతరం దాదాపు 11 గంటలకు రైతుల చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభంకానుంది. రైతుల ఆందోళనలకు మద్దతుగా బిజెపి నుంచి బయటకు వచ్చిన మంజీందర్ సింగ్, తన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుంచి ర్యాలీలో పాల్గొనేందుకు గ్వాలియర్, అశోక్ నగర్, మోరేనా, శిప్పురి నుంచి దాదాపు పది వేల ట్రాక్టర్లతో ఢిల్లీ చేరారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో రైతులు ట్రాక్టర్ ర్యాలీలు చేపడుతారని, వీటి సంఖ్య లక్షల్లో ఉండనుందని రైతు సంఘం నేత ధర్మేంద్ర మాలిక్ వెల్లడించారు.