
న్యూఢిల్లీ : రైతుల నిరసనల కోసం రామ్‌లీలా మైదానం కాకుండా సంత్ నిరంకరీ మైదానాన్ని కేటాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఢిల్లీని ఘెరావ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు సింగు సరిహద్దు, టిక్రి సరిహద్దులను మాత్రమే దిగ్భందించామని, రాజధానికి చేరుకునే గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ జాతీయ రహదారులను బ్లాక్ చేస్తామని అన్నారు. పంజాబ్, హర్యానాలకు చెందిన రైతులను ఢిల్లీ చేరకుండా అడ్డుకోవడంతో.. గత మూడు రోజులుగా వారు సింగు సరిహద్దు, టిక్రి సరిహద్దుల్లో శిబిరాలు వేసుకుని నిరసన తెలుపుతున్నారు. దీంతో సంత్ నిరంకారీ మైదానంలో ఆందోళనకు పోలీసులు అనుమతించారు. కాని రామ్‌లీలా మైదానంలోనే నిరసన చేపడతామంటూ రైతులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. సింగ్ సరిహద్దులో విలేకరుల సమావేశంలో రైతు నేత సుర్జీత్ సింగ్ ఫుల్ మాట్లాడుతూ.. బురారీ మైదానానికి వెళ్లే బదులుగా గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ జాతీయ రహదారులను అడ్డుకుంటామని అన్నారు. బురారీ మైదానం బహిరంగ జైలు లాంటిదని, అక్కడ నిరసన తెలిపేందుకు తాము అంగీకరించబోమని అన్నారు. ఢిల్లీ చేరుకున్న తమను జంతర్‌మంతర్ వద్దకు వెళ్లకుండా బురారీ మైదానానికి తీసుకు వెళ్లారని, తాము అక్కడికి వెళ్లమని, నాలుగు నెలలైనా ఇక్కడే ఆందోళన చేపడతామని ఉత్తరాఖండ్‌కి చెందిన పౌల్ అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ నేతలెవరినీ ఈ ఆందోళనలో పాల్గనేందుకు అనుమతించమని పౌల్ చెప్పారు. గత రెండు నెలలుగా పంజాబ్‌లో ఆందోళన చేస్తున్నామని, అక్కడ ఏ రాజకీయ నేతకు అవకాశం కల్పించలేదని అన్నారు. ఈ ఆందోళన ద్వారా రాజకీయ నేతలు లబ్థి పొందడం తప్ప రైతులకు ఒరిగేదేమీ ఉండదని అన్నారు. ఆందోళనకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, పరిస్థితులు నిశితంగా పరిశీలిస్తున్నామని పేరు చెప్పేందుకు ఇష్టపడని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. రైతులు ఆందోళనకు సంబంధించి బురారీలోని సంత్ నిరంకరీ మైదానంలో అన్ని సౌకర్యాలు కల్పించామని, పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ విజయంత్ ఆర్య తెలిపారు.