Mar 02,2021 22:54

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డిఎంహెచ్‌ఒ చంద్రనాయక్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : చిన్నారుల్లో నులిపురుగు నివారణకు డీవార్మింగ్‌ డేను బుధవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.సి చంద్రనాయక్‌ తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల స్వాస్థ్య కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు డీ-వార్మింగ్‌ మాత్రలు (ఆల్బెండాజోల్‌ 400 మి.గ్రా) నమిలి తినిపించనున్నట్లు చెప్పారు. పాఠశాలలో ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం చేతులు శుభ్రపరచుకోవడం, పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత కోసం తెలియజేయనున్నట్లు వివరించారు. నులిపురుగుల వల్ల ఏర్పడే సమస్యలను వివరించాలని ఆదేశించామన్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం మాత్రలు నమిలి మింగించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 5,98,065 మంది చిన్నారులకు డీ వార్మింగ్‌ మాత్రలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఏ ఒక్కరూ తప్పిపోరాదన్నారు. కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ, ఐసిడిఎస్‌, విద్యాశాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలను మింగించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంఘాలు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాయని చెప్పారు. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని తెలిపారు.
అదనపు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.జగన్నాథం మాట్లాడుతూ చిన్నారుల్లో నులి పురుగులు ఉండడం వల్ల రక్తహీనత ఏర్పడుతుందన్నారు. తద్వారా ఎదుగుదల సమస్య వస్తుందని చెప్పారు. రక్తహీనత కారణంగా పలు సమస్యలు ఏర్పడుతుందన్నారు. నులిపురుగులను అరికట్టేందుకు ప్రతి ఆరు నెలలకోసారి డీ వార్మింగ్‌ డేను నిర్వహిస్తున్నామని తెలిపారు. బహిరంగ మలవిసర్జన కారణంగా నులిపురుగుల సమస్య ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుందని వివరించారు. సమావేశంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ సమన్వయ అధికారి కె.అప్పారావు, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి ఎల్‌.భారతీ కుమారి దేవి, జిల్లా మలేరియా అధికారి వీర్రాజు, డిబిసిఎస్‌ ప్రాగ్రాం అధికారి రమణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.