Sep 24,2021 01:57

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న పథకం కార్మికులు, వెలుగు విఓఏలు దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం సమ్మె చేయనున్నారు. ప్రజలకు వివిధ రకాల సేవలందిస్తున్న వీరికి కనీస వేతనాలు, ఇఎస్‌ఐ, పిఎఫ్‌, గ్రాట్యూటీ వంటి సదుపాయాలేవీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం లేదు. తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య కోవిడ్‌ సేవలందిస్తున్న ఆశ వర్కర్లకు ప్రమాద బీమా చెల్లించడంలేదు. పెంచుతామన్న ఏడువందల వేతనం అంగన్‌వాడీలకు ఇవ్వడంలేదు. కనీస వేతనాలు ఇవ్వని ప్రభుత్వం, వీరిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాల్లో కోత పెట్టింది. బియ్యంకార్డు మొదలుకొని అమ్మఒడి, పింఛన్‌, నవరత్నాల పథకాలేవీ వీరి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదు. అంగన్‌వాడీ, మధ్యాహ్నభోజన పథకం కార్మికులు, ఆశా, విఓఎలు ఆరోగ్యం, ఆహారం, విద్య వంటి పలు సేవలందిస్తున్నారు. వీరి సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు స్కీం వర్కర్లు శుక్రవారం మండల కేంద్రాల్లో నిరసన, ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టనున్నారు. మండలాల్లో తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేయనున్నారు. సమ్మె విజయవంతానికి ఆయా సంఘాలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ప్రభుత్వాలకున్న నిర్లక్ష్యాన్ని విస్తృతంగా స్కీం వర్లర్కలోకి తీసుకెళ్లాయి.
స్కీం వర్కర్ల ఐక్య కార్యాచరణ కమిటీ సమ్మె డిమాండ్లు
- స్కీంలన్నింటినీ సంస్థాగతం చేసి స్కీం వర్కర్లను రెగ్యులర్‌ చేయాలి
- కనీస వేతనం రూ.21వేలు చెల్లించి, ఇఎస్‌ఐ, పిఎఫ్‌, గ్రాట్యూటీ సదుపాయం కల్పించాలి
- రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలి
- కోవిడ్‌తో మృతి చెందిన స్కీంవర్కర్లకు రూ.50 లక్షలు బీమా పథకం అమలు చేయాలి
- రాష్ట్ర ప్రభుత్వం స్కీంవర్కర్లందరికీ రేషన్‌కార్డులు, సంక్షేమ పథకాలు అమలు చేయాలి
- వ్యవసాయ నల్ల చట్టాలు, కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి
- కోవిడ్‌ విధులు నిర్వహిస్తున్న స్కీం వర్కర్లకు నెలకు రూ.10వేలు అదనపు వేతనమివ్వాలి
- ప్రాధమిక ఆరోగ్యం, విద్య, పోషకాహార సర్వీసులు ప్రయివేటీకరణ విరమించాలి
- నూతన విద్యావిధానం రద్దు చేయాలి. సార్వత్రిక ఆరోగ్య హక్కు కోసం చట్టం చేయాలి
- నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. ధనికులపై పన్నులు వేయాలి
- వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచి, నిర్ధిష్ట గడువులోగా ప్రజలందరికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలి