Sep 14,2021 19:19

ఓస్లో : నార్వేలోని మధ్యే వామపక్ష (సెంటర్‌ లెఫ్ట్‌) ప్రతిపక్ష పార్టీలు సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సాధించాయి. కన్జర్వేటివ్‌ ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్‌ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత పదవి నుండి వైదొలగనున్నారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు లేబర్‌ పార్టీ నేత జోనాస్‌ గర్‌ స్టోయెర్‌ తెలిపారు. చమురు, ప్రైవేటు యాజమాన్యం నుండి యురోపియన్‌ యూనియన్‌తో నార్వే సంబంధాల వరకు పలు అంశాలపై మధ్యే వామపక్షవాద భాగస్వాములతో వచ్చే వారం జరిగే చర్చల్లో స్టోయర్‌ ఒప్పించాల్సి వుంది. అతిపెద్ద పార్టీగా, కొత్త ప్రభుత్వాన్ని, కొత్త కార్యాచరణను అందిస్తామని పార్టీ సభ్యులనుద్దేశించి స్టోయెర్‌ చెప్పారు. మార్పు కావాలని కోరుకుంటున్న పార్టీలన్నిటినీ చర్చలకు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. సెంటర్‌ పార్టీ, సోషలిస్టు లెఫ్ట్‌తో ముందుగా చర్చలు ప్రారంభిస్తానని చెప్పారు. 169 సీట్లు గల పార్లమెంట్‌లో మెజారిటీ కావాలంటే 85 సీట్లు లభించాల్సి వుంది. ప్రస్తుతమున్న అంచనాలు నిజమైతే, లేబర్‌, సెంటర్‌ పార్టీ, సోషలిస్టు లెఫ్ట్‌లతో కూడిన సంకీర్ణ కూటమిని స్టోయెర్‌ ఏర్పాటు చేయవచ్చు. ఈ పార్టీలన్నింటికీ కలిపి 89 సీట్లు వచ్చాయి. మైనారిటీతోనే పాలించడం కూడా లేబర్‌ పార్టీకి ఒక మార్గంగా వుండనుంది.