May 09,2021 11:54

''అమ్మా, తాతయ్య సైకిల్‌ గోడ దగ్గర పెట్టుకోమని చెప్పమ్మా. రోజూ నా సైకిల్‌ తీసుకోవడం కష్టంగా ఉంటోంది.'' కిషోర్‌ వాళ్ళ అమ్మకు ఫిర్యాదు చేశాడు.
పేపర్‌ చదువుకుంటున్న నేను వరండాలోకి వెళ్లేసరికి, నా సైకిల్‌ గోడవారగా పెట్టి వాడి సైకిల్‌ తీసుకుని స్కూలికి వెళ్ళిపోయాడు. మనవరాలు సుప్రజ సైకిల్‌ తీసుకోవడానికి నా సైకిల్‌ అడ్డు లేదు కదా అని పరిశీలన చేసి, అప్పుడు లోపలకు వచ్చాను. కోడలు సరయు టిఫిన్‌ టీపాయి మీద పెట్టి నా కోసం నిలబడి ఉంది.
''మావయ్య గారూ, మీరు వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి. వాళ్ళే సర్దుబాటు చేసుకుంటారు. టిఫిన్‌ తిని టాబ్లెట్‌ వేసుకోండి.'' అని లోపలకు వెళ్ళింది.
మా కోడలికి నేనంటే చాలా గౌరవం, అభిమానం. నన్ను తండ్రిలా చూసుకుంటుంది. నా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. నా భార్య సుజాత మా అమ్మాయి పురిటి కోసం అమెరికా వెళ్ళింది. ఇంకో ఆరు నెలల వరకూ రాదు. ఆలోచిస్తూనే టిఫిన్‌ తిని బి.పి. టాబ్లెట్‌ వేసుకున్నాను. మల్లీ పేపర్లో పడ్డాను.
ఒక గంట గడిచేసరికి మనవరాలు స్కూలికి, అబ్బాయి రామచంద్రం ఆఫీస్‌కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత సరయూ కూడా కాలేజీకి వెళ్ళింది. తను మా వీధి చివర ఉన్న జూనియర్‌ కాలేజీలో ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా పనిచేస్తోంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి నాకు భోజనం పెట్టి, తనూ భోజనం చేసి మళ్లీ కాలేజీకి వెళ్లి నాలుగు గంటలకు వస్తుంది.
వాళ్ళు అందరూ వెళ్ళడంతో వరండాలోకి వచ్చాను. నా సైకిల్‌ ఒక్కటే ఉంది. ఒక పాతగుడ్డ తీసుకుని సైకిల్‌ తుడవ సాగాను. పెద్దగా దుమ్ము లేకపోయినా రోజూ తుడవడం మా నాన్న నుంచి వచ్చిన అలవాటు.
నిజానికి ఈ సైకిల్‌ నాది కాదు. మా నాన్నది. దీన్ని చూస్తే మా నాన్న గుర్తుకు వస్తాడు. నాన్నతో కలిసి ఈ సైకిల్‌ మీద తిరిగిన ఊళ్ళూ గుర్తుకు వస్తాయి. నా మనసు గతంలోకి పరుగులు తీసింది.
 

                                                                    ***

శివపురం లింగాల వీధిలోని గున్నయ్య మాష్టారి స్కూల్లో నేను ఐదోతరగతి చదువుతుండగా, లలిత కళల పట్ల నాకు ఇష్టం ఏర్పడింది. నాన్న భాగవతంలో పద్యాలు శ్రావ్యంగా పాడేవాడు. తాతగారు సంగీత విద్వాంసులు. నాన్నకు వయోలిన్‌ ఆయనే నేర్పారు. నాన్న కొఠాలపర్రు స్కూల్లో ప్రాథమిక ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. తాతగారు వృద్ధులు అవడం వల్ల నాన్నే చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే సంగీత సభలకు వెళ్లి వయోలిన్‌ వాయించేవారు. ఒకసారి నేనూ వస్తానని మారాం చేయడంతో నన్నూ భట్లమగుటూరు తీసుకు వెళ్ళారు. ఆ ఊళ్ళో ప్రతి ఏటా త్యాగరాజ ఉత్సవాలు పెద్దఎత్తున చేసేవారు. చెన్నై నుంచి కూడా పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు వచ్చి కచేరీలు చేసేవారు.
నాన్న వయోలిన్‌ పెట్టె సైకిల్‌ కారేజికి కట్టుకుని, నన్ను ముందు కూర్చోపెట్టుకుని సైకిల్‌ మీద భట్లమగుటూరు తీసుకు వచ్చారు. తాటాకులతో చాలా పెద్ద పందిరి వేశారు. రంగురంగుల లైట్లు పెట్టారు. నాన్న, నన్ను ముందు వరసలో కూర్చోబెట్టి, తను వేదిక మీదకు వెళ్ళాడు. ఒక అరగంటకు కచేరీ ప్రారంభం అయింది. నిర్వాహకులు కచేరీ చేసే ఆవిడకు, నాన్నకు, మృదంగం వాయించే ఆయనకు పూలదండలు వేసి సత్కారం చేశారు. చెన్నై నుంచి వచ్చిన ఆవిడ చాలా బాగా పాడారు. అవి త్యాగరాజ కీర్తనలు అని నాకు అప్పుడు తెలియదు. తర్వాత నాన్న చెప్పాడు. కచేరీ మధ్యలో నాన్నకు, మృదంగం వాయించే ఆయనకు టీలు ఇచ్చారు. పాడే ఆవిడ మాత్రం ఏమీ తీసుకోలేదు. నాకు ఒక గ్లాసులో పాలు తీసుకువచ్చి ఇచ్చారు. రాత్రి పదకొండు గంటలకు కచేరీ ఐపోయింది.
నాన్నా, నేను సైకిల్‌ మీద ఇంటికి వస్తుంటే... నాన్న నాకు నిద్ర రాకుండా ఉండడానికి పద్యాలు పాడేవాడు. భట్లమగుటూరు నుంచి శివపురం రావడానికి సుమారు గంట పట్టేది. ఆ వెన్నెల్లో నాన్నతో కలిసి సైకిల్‌ మీద ప్రయాణం చాలా బాగుండేది. ఆలమూరు నుంచి మార్టేరు వరకు ఉన్న దారిలో చెట్లు ఎత్తుగా పెరిగి గొడుగు పట్టినట్టు ఉండేవి. కాదమల్లె పూల వాసనలు, సంపెంగ పూల వాసనలు మత్తుగా ఉండేవి. అమ్మ పండుగలకు అమ్మమ్మగారి ఊరు ముక్కామల వెళ్ళేటప్పుడు కూడా నేను అమ్మతో వెళ్ళేవాడిని కాదు. నాన్నతోనే వస్తాననేవాడిని. ముక్కామల వెళ్ళాలంటే శివపురం నుంచి పెరవలి వరకు బస్సు మీద వెళ్లి, అక్కడ నుంచి గుర్రబ్బండి మీద వెళ్ళాలి. అమ్మ పండుగకు వారం ముందు వెళ్ళేది. నాన్న పండుగ ముందురోజే వెళ్ళేవాడు. నేనూ, నాన్నా సైకిల్‌ మీద అడ్డ దారిని వడలి, ఖండవల్లి మీదుగా ముక్కామల వెళ్ళేవాళ్ళం. ఇది చాలా దగ్గర. కానీ ఈ మార్గంలో బస్సులు వెళ్ళవు. నాన్నా, నేను కబుర్లు చెప్పుకుంటూ దారిలో వింతలూ, విశేషాలు చూస్తూ వెళ్ళేవాళ్ళం. ఖండవల్లి దగ్గర రైతులు చెరుకు ఆడుతూ ఉండేవారు. చిన్న పిల్లల్ని పిలిచి మరీ చెరుకు రసం ఇచ్చేవారు. నేను రెండు గ్లాసులు తాగేవాడిని. ఈ దారిలో వెళ్ళడానికి అది కూడా ఒక కారణం.
నాన్న సైకిల్‌ కొత్తదిగా ఉండడం వల్ల మా వీధిలో వాళ్ళు అప్పుడప్పుడు సైకిల్‌ అడిగి పట్టుకెళ్లేవారు. మార్టేరు వెళ్లి హౌమియో మందులు తెచ్చుకోవాలని, జగన్నాధపురం రామేశ్వర స్వామి గుడికి వెళ్లాలని ఏవో కారణాలు చెప్పేవారు. నాన్న ఎవరినీ కాదనేవారు కాదు. కానీ నాకు చాలా కోపంగా ఉండేది. మన సైకిల్‌ వాళ్ళు ఎవరో తొక్కు కోవడం ఏమిటని. అమ్మకి భయంగా ఉండేది, సైకిల్‌ ఎక్కడ పాడు చేస్తారోనని. కానీ వాళ్ళు సైకిల్‌ జాగ్రత్తగానే తెచ్చి ఇచ్చేవారు.
ఒకసారి మాత్రం చాలా ప్రమాదమే జరిగింది. శివాలయం పూజారి గారు జుత్తిగ వెళ్లాలని నాన్న సైకిల్‌ పట్టుకెళ్లారు. మర్నాడు పొద్దున్న పూజారి గారు పాలేరు రంగన్న చేత సైకిల్‌ పంపించారు. ముందు చక్రం వంగి పోయింది. హేండిల్‌ బార్‌ పక్కకు తిరిగి ఉంది. 'దున్నపోతు తరుముకు వస్తుంటే పూజారి గారు మునసబు గారి ఇంటి గోడను గుద్దేసి పడిపోయారండి. ఆయన మోకాలికి దెబ్బ తగిలింది. నన్ను సైకిల్‌ ఇచ్చి రమ్మన్నారండి' అని సైకిల్ని మా ఇంటి గోడకు చేర్చి వెళ్ళిపోయాడు రంగన్న.
సైకిల్ని ఆ స్థితిలో చూసి మా ముగ్గురికి చాలా బాధ కలిగింది. అమ్మ గట్టిగా చెప్పింది, నాన్నతో : 'ఇంక సైకిల్‌ ఎవరికీ ఇవ్వకండి. నిష్టూరం వస్తే రానీయండి.' అని. నాన్న బాధగా సైకిల్‌ నడిపించుకుంటూ తీసుకువెళ్లి గంగరాజు షాప్‌లో ఇచ్చి వచ్చాడు బాగు చేయమని. ఆ రోజంతా నాన్న దిగులుగానే ఉన్నాడు. రెండు రోజులు పోయాక గంగరాజు నాన్న సైకిల్‌ తెచ్చి ఇచ్చాడు. ముందు చక్రం రిమ్ము, ఊచలు కొత్తవి వేశాడు. రిపేరుకి చాలా డబ్బులే అయ్యాయి. అప్పటినుంచి సైకిల్‌ని ఎవరికీ ఇవ్వలేదు.
రోజూ సైకిల్‌ శుభ్రంగా తుడిచేవాడు నాన్న. ప్రతి ఆదివారం, కొబ్బరినూనె, కిరసనాయిల్‌ కలిపి ఒక కొబ్బరి చిప్పలో పోసి, చిన్న గుడ్డముక్కతో సైకిల్‌ని పాలిష్‌ చేసేవాడు. ఆ వాసన గమ్మత్తుగా ఉండేది. అప్పుడు సైకిల్‌ నిగనిగలాడుతూ మెరిసి పోయేది. చాలామంది సైకిల్‌ తొక్కుతుంటే కీచుమని శబ్దం వచ్చేది. కానీ మా నాన్న సైకిల్‌ మాత్రం ఎప్పుడూ శబ్దం చేయకుండా మెత్తగా వెళ్ళేది. సిద్ధాంతం, వడలి, ఇరగవరం ఎన్ని ఊళ్ళు బదిలీ అయినా నాన్న సైకిల్‌ మాత్రం వదలలేదు.
నేను డిగ్రీ అయ్యాక సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాసి తహసిల్దార్‌ ఆఫీసులో గుమాస్తాగా చేరి, అంచలంచలుగా ఎదిగి తహసీల్దారుగా రిటైరయ్యాను. కానీ నా దురదృష్టం నా రిటైర్మెంట్‌కి నాన్న చనిపోయారు.
ఇప్పుడు తిరిగి శివపురంలోనే స్థిరపడ్డాను. రోజూ నాన్న సైకిల్‌ మీద బజార్‌కి , పార్క్‌కి వెళ్ళేవాడిని. ఈ మధ్యన ఆయాసం వస్తుంటే డాక్టర్‌కి చూపించుకున్నాను. సైకిల్‌ తొక్కవద్దని ఆయన సలహా ఇచ్చారు. అప్పటినుంచి సైకిల్‌ తొక్కడం మానేశాను. కానీ రోజూ సైకిల్‌ ని నడిపించుకుంటూ బజార్‌కి వెళ్తున్నాను.

                                                                        ***

''ఏమిటి మావయ్య గారూ, ఇంకా సైకిల్‌ దగ్గరే ఉన్నారు? దానితో ముచ్చట్లు ఇంకా అవలేదా? రండి భోజనం చేద్దురుగాని'' అని సరయూ పిలవడంతో వాస్తవంలోకి వచ్చాను. లేచి చేతులు కడుక్కుని వచ్చేసరికి డైనింగ్‌ టేబుల్‌ మీద భోజనం రెడీగా ఉంది. నాకిష్టమైన టమాటో పప్పు, కొబ్బరి పచ్చడి, కొత్తిమీర చారు, నన్ను ఊరించాయి. సుష్టుగా తిని నా రూమ్‌లోకి వెళ్లాను. సరయూ కూడా భోజనం చేసి, నాకు మంచి నీళ్ళు టేబుల్‌ మీద పెట్టి మళ్లీ కాలేజీకి వెళ్ళింది. నేను వీధి తలుపు వేసి వచ్చి టాబ్లెట్‌ వేసుకుని పడుకున్నాను. నాలుగు గంటలకు కోడలు వచ్చి కాలింగ్‌ బెల్‌ కొట్టే వరకూ నిద్ర పోతూనే ఉన్నాను. లేచి తలుపు తీశాను.
ఐదు గంటలకు టీ తాగి సైకిల్‌ తీసుకుని నెమ్మదిగా పార్క్‌కి బయల్దేరాను. దారిలో తెలిసున్న వాళ్ళు పలకరించి యోగక్షేమాలు అడిగితే జవాబు ఇచ్చి పార్క్‌కి వచ్చాను. అప్పటికే నా మిత్రులు సుబ్బారావు, సూర్యనారాయణ వచ్చి బెంచి మీద కూర్చొని ఉన్నారు. ఒక గంటసేపు లోకాభిరామాయణం మాట్లాడుకుని ఇంటికి బయల్దేరాం. గాంధీ బొమ్మల సెంటర్‌ దగ్గర వాళ్ళు ఇద్దరూ నాకు వీడ్కోలు చెప్పి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
నేను నెమ్మదిగా సైకిల్‌ని నడిపించుకుంటూ వెళ్తుంటే, మా ఆఫీస్‌లో పనిచేసే కృష్ణమూర్తి కనిపించాడు.
''గురువు గారూ, నాకో చిన్న సందేహం. ఎప్పటినుంచో అడగాలని అనుకుంటున్నాను. ఏమీ అనుకోరుగా?''
''ఏమీ అనుకోను. అడుగు.'' అన్నాను నవ్వుతూ.
''మీకు సైకిల్‌ తోడా? సైకిల్‌కి మీరు తోడా?'' ప్రశ్నించాడు.
ఒక్క నిముషం సైకిల్‌ కేసి చూసాను. కుడి చేతితో సైకిల్‌ సీట్‌ నిమిరాను. తిరిగి రెండు చేతులతో హేండిల్‌ బార్‌ పట్టుకున్నాను. అతని కేసి తిరిగి ''రెండూనూ'' అని ముందుకు సాగాను.
నాన్న చిన్నప్పుడు నా చేయి పట్టుకుని స్కూలికి తీసుకు వెళ్ళేవాడు. ఇప్పుడు ఈ సైకిల్‌ రూపంలో నాన్న నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకు వెళ్తున్నాడనే నేను భావిస్తున్నాను. ఈ సైకిల్‌ని నేనో వస్తువుగా అనుకోవటం లేదు. నాన్నగానే భావిస్తూ, నాకు జీవితాంతం తోడుగా ఉంటుందన్న ఆనందంతో బతుకుతున్నాను.
 

ఎంవిఆర్‌ సత్యనారాయణ మూర్తి
98486 63738