Mar 02,2021 23:34

సమావేశంలో మాట్లాడుతున్న విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : ఈనెలాఖరు నాటికి నాడు-నేడు పనులను పూర్తి చేయాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో 15,715, జిల్లాలో 1249 పాఠశాలల పనులు పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. మనబడి నాడు-నేడుపై జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నాడు-నేడు పనులు బాగా చేపడుతున్నారని అభినందించారు. నాడు-నేడు పనుల ప్రభావం స్పష్టంగా, దీర్ఘకాలం ఉండాలని, దాని ప్రభావం విద్య, విద్యాబోధనపై ఉండాలని సూచించారు. నాడు-నేడు పనులతో పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని, చిన్నారుల బంగారు భవితకు గట్టి పునాదులు పడుతున్నాయన్నారు. చిన్నారుల ప్రాథమిక హక్కులను నాడు-నేడు పనుల ద్వారా కాపాడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది 4.30 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతున్నారని, నెల్లూరు జెసి, పార్వతీపురం ఐటిడిఎ పిఒ తమ పిల్లలను చేర్పించారని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. నాడు-నేడు పనులు సివిల్‌ పనులు మాత్రమే కాదని, సామాజిక భాగస్వామ్యమని వివరించారు. జిల్లాలో నాడు-నేడు పనుల్లో రూ.10.67 కోట్లు ఖర్చు చేయని నిధులున్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. మరుగుదొడ్లు, తాగునీరు పనులను పూర్తి చేయడంలో ఎటువంటి జాప్యం చేయరాదన్నారు. ఎంఇఒలు, ఎఇలు సమన్వయంతో పనిచేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
మరుగుదొడ్లు, మరమ్మతుల పనులు దాదాపుగా పూర్తయ్యాయని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. పెయింటింగ్‌ పూర్తి చేసేందుకు మరిన్ని బృందాలను నియమించాల్సి ఉందన్నారు. స్థానిక అధికారులతో పర్యవేక్షణ చేస్తున్నామని, మండల ప్రత్యేక అధికారులూ పర్యటిస్తూ తరచూ తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని పాఠశాలల్లో ఒకే రకమైన డిజైన్‌ను తీసుకున్నట్లు తెలిపారు. మరుగుదొడ్లకు వాటర్‌ ప్రూఫ్‌ డోర్లను వినియోగిస్తున్నామని, గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ పనులతో ప్రాథమిక పాఠశాలల రూపురేఖలు బాగా మారాయన్నారు. కొన్ని పాఠశాలల పనులకు అంచనాలు మళ్లీ తయారు చేయాల్సిన అవసరముందన్నారు. మరుగుదొడ్ల నిర్వహణకు స్వచ్ఛత ఖాతాలో చేర్చాలని సూచించారు. రెండు, మూడో విడతల్లో మరింత సమర్థవంతంగా చేస్తామని చెప్పారు.
నాడు-నేడు ప్రభుత్వ సలహాదారు మురళి మాట్లాడుతూ కొన్నిచోట్ల మరుగుదొడ్లు ఇంకా పూర్తి చేయాల్సి ఉందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌కు అనుసంధానం చేయొచ్చని చెప్పారు. జిల్లాలో పనులు చక్కగా చేశారని ప్రశంసించారు. సమావేశంలో సమగ్ర శిక్ష అభియాన్‌ ఎస్‌పిడి వెట్రి సెల్వి, జాయింట్‌ కలెక్టర్‌ కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్‌ ఎం.నవీన్‌, ఎపిఇడబ్ల్యుఐడిసి ఎమ్‌డి రాజేశ్వరరెడ్డి, విద్యా శాఖ ఆర్‌.జె.డి నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి కె.చంద్రకళ, సమగ్ర శిక్ష ఎపిసి పి.వి రమణ తదితరులు పాల్గొన్నారు.