Oct 28,2020 21:47

suneetha

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో
అధికారం ఉంటే చాలు.. ఏ ప్రయోజనాలైనా నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇదే తీరున రాజకీయ నేతలు నడుస్తున్నారు. పార్టీల ఎజెండాల కన్నా నేతల వ్యక్తిగత ఎజెండాలే ఇప్పుడు కీలకంగా మారాయి. వారి ప్రయోజనాలే ప్రధానమయ్యాయి. పార్టీ జెండా ప్రశ్నార్ధకమైంది. విలువలు.. సిద్ధాంతాలు.. రాజకీయ లక్ష్యాలు పాతరవుతున్నాయి. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పంథాలో పోయిందే ఇప్పుడు పాలకపక్షంగా ఉన్న వైసిపి కూడా అదే దారిన నడుస్తోంది. ఫిరాయింపులకు పాల్పడుతోంది. కొన్ని సమయాల్లో పార్టీ ఫిరాయించిన వారిపై వేటు తప్పదని తేలింది. ఇప్పుడు ఎమ్మెల్సీ పోతుల సునీత విషయంలో ఇదే వెల్లడవుతోంది. అనర్హత వేటు తప్పదనే భయంతోనే ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత బుధవారం నాడు రాజీనామా చేశారు. ఇటీవల ఆమె అధికార పార్టీలో చేరారు. దీనిపై తెలుగుదేశం నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆమెకు దీనిపై తొమ్మిది నోటీసులు అందాయి. దేనికీ సమాధానం ఇవ్వలేదు. వ్యక్తిగతంగా హాజరై కూడా వివరణ ఇవ్వాలి. ఇవన్నీ ధిక్కరించడంతో ఆమెపై వేటుకు రంగం సిద్ధమైందని సమాచారం. దీంతో ఆమె వ్యూహాత్మకంగా ముందుగానే రాజీనామా చేశారు. ఈ జాగ్రత్తలు తీసుకున్న ఎమ్మెల్యే కరణం బలరాం అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారు. తన కుమారుడిని సిఎం సమక్షంలో వైసిపిలో చేర్చారు. ఆయన పార్టీ కండువా కప్పుకోలేదు. ఆయన మాత్రం వ్యూహాత్మకంగా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలుగుదేశం వీడి వైసిపిలో చేరినా అది అనధికారికంగానే ఉంది. ఇప్పటికీ ఆయన తెలుగుదేశం నుంచి గెలిచిన ఎమ్మెల్యేగానే ఉన్నారు. జిల్లాలో ఏడాదిలో రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రం చీలాక కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఐదేళ్లు రాజధానికే ప్రాధాన్యత ఇచ్చింది. జిల్లాల్లో ఏం అభివృద్ధి చేసిందనే అంశం కూడా ప్రశ్నార్ధకంగా మారింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు చక్రం తిప్పిన సీనియర్‌ నేతలందరూ ఇప్పుడు వైసిపిలో ఉన్నారు. ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. దీంతో ఆనాడు కీలకమైన నేతలు ఎక్కువ మంది వైసిపిలో ఉన్నారు. సీనియర్‌ నేత కరణం బలరాం అంటే తెలుగుదేశంలో ఎంతటి పాత్ర ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. అధికారంలో లేనప్పుడూ ఆయన పార్టీకి కీలకంగా ఉన్నారు. జిల్లాలో ప్రతిపక్షపార్టీగా ఉన్నప్పుడు ఆయన అండగా ఉన్నారు. తర్వాత దామచర్ల జనార్ధన్‌ పార్టీ పగ్గాలు చేపట్టారు. తెలుగుదేశంలో చంద్రబాబు సహచరుడిగా ఉన్న కరణం బలరాం ఇప్పుడు వైసిపిలో ఉన్నారు. ఇప్పుడు చీరాల నుంచి ఆయన, ఆయన కుమారుడు పాలకపక్షంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దర్శి నుంచి గెలిచి మంత్రిగా ఐదేళ్లు ఏకచత్రాధిపత్యం వహించిన శిద్దా రాఘవరావు కూడా కొన్ని కారణాల వల్ల పార్టీని వీడారు. ఆయనపై వచ్చిన ఒత్తిళ్లు తీవ్రంగానే ఉన్నాయి. రాజకీయంగానూ, కుటుంబపరంగానూ ఒత్తిళ్లు తట్టుకోలేకనే ఆయన పార్టీని వీడారు. తెలుగుదేశంలో శిద్దా రాఘవరావు పాత్ర చెప్పలేనిదే.. ఆయన అన్ని విషయాల్లో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. ఆయన వ్యాపారాలను టార్గెట్‌ చేశారు. పెనాల్టీల పేరుతో ఆయన కుటుంబాన్ని ఊపిరి తిప్పుకోకుండా చేశారు. దీంతో ఆయన పార్టీని వీడారు. అయితే పాలకపక్షంలో ఆయన అంత క్రియాశీలకంగా ముందుకు పోలేకపోతున్నారనే చర్చ కూడా ఉంది. ఇక దర్శి నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తెలుగుదేశం పార్టీని వీడారు. ఆయన కూడా వైసిపిలో చేరారు. ఇలా కీలకమైన నేతలందరూ తెలుగుదేశం పార్టీని వీడి వైసిపిలో చేరారు. వీరితో పాటు ఇంకా కొందరు నేతలపై ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పైనా ఇప్పటికీ ఒత్తిళ్లు ఉన్నాయి. ఇప్పటికే ఆయన క్వారీలను అష్ట దిగ్భంధనం చేశారు. ఆయన కోర్టులకు వెళ్లారు. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వడం లేదు. తెలుగుదేశం వీడి వైసిపిలో చేరాలని ఆయనపై ఒత్తిళ్లు ఉన్నాయి. మరో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుపైనా ఇదే తరహాలో ఒత్తిళ్లు చేస్తున్నారు. వీరిద్దరూ పార్టీని వీడేందుకు సిద్ధంగా లేరు. ఈ తరహా ధోరణులు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించింది. వైసిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు నలుగురిని లాగేశారు. అప్పట్లో వైసిపి ఎమ్మెల్యేలుగా ఉన్న గొట్టిపాటి రవికుమార్‌, ముత్తుమల అశోక్‌రెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, పోతుల రామారావు ఉన్నారు. వీరిలో తర్వాతి ఎన్నికల్లో గొట్టిపాటి ఒక్కరే గెలిచారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ చేసిన అప్రజాస్వామిక పద్ధతులకు మూల్యం చెల్లించుకుంది. ఎన్నికల్లో అందరూ పరాజయం చూశారు. ఆ గుణపాఠాలు వైసిపి నేర్వడం లేదు. ఆనాడు ఈ విధానాలను తప్పుపట్టిన వైసిపి అధినేత జగన్‌ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన తప్పిదాలనే చేస్తున్నారు. ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు. ఈ ఫిరాయింపుల నుంచి ఎమ్మెల్సీ పోతుల సునీత మాత్రం బయట పడలేకపోయారు. అనర్హత వేటుకు భయపడి ఆమె రాజీనామా చేశారనే చర్చ సాగుతోంది. ఏదేమైనా జిల్లా రాజకీయాల్లో విలువల కన్నా నేతల వ్యక్తిగత ఎజెండాలే ఇప్పుడు కీలకంగా మారాయి.