Oct 28,2021 15:55

శ్రీనగర్‌ :  టి-20 మ్యాచ్‌లో పాక్‌ గెలుపొందడంతో సంబరాలు చేసుకున్నారంటూ అరెస్ట్‌ చేసిన కాశ్మీర్‌ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని పిడిపి అధినేత మెహబూబా ముఫ్తీ డిమాండ్‌ చేశారు. ఈ నెల 24న భారత్‌-పాక్‌ల మధ్య జరిగిన టి20 మ్యాచ్‌లో పాక్‌ గెలుపొందడంతో సంబరాలు జరుపుకున్నారంటూ ముగ్గురు కాశ్మీర్‌ విద్యార్థులను యుపి ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. జమ్ము కాశ్మీర్‌లో, బయట కాశ్మీర్‌ విద్యార్థులపై అణచివేతను ఖండిస్తున్నామని ముఫ్తీ ట్విటర్‌లో పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్‌లో రెండు సంవత్సరాల అణచివేత అనంతరం ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు యత్నిస్తోందని అన్నారు. బిజెపి నకిలీ దేశభక్తితో భారత్‌ ఆలోచనను విస్మరించేలా చేస్తోందని మండిపడ్డారు. ఆ ముగ్గురు కాశ్మీర్‌ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే వారు క్యాంపస్‌లో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయలేదంటూ ఆగ్రా కాలేజ్‌ అధికారులు ఇచ్చిన నివేదికను ఈ పోస్ట్‌కు జోడించారు. బిజెపి కార్యకర్తలు తమపై ఒత్తిడి తీసుకువచ్చారంటూ కాలేజీ యాజమాన్యం నివేదికలో పేర్కొంది.