Jul 31,2021 08:12
  • ఏడాదిన్నరగా సర్కారు ఉద్యోగుల ఎదురుచూపులు
  • ఇహెచ్‌ఎస్‌ కార్డున్నా ప్రైవేటు ఆస్పత్రుల్లో అందని వైద్యం

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : గుంటూరుకు చెందిన ఒక టీచర్‌ ఏడాదిన్నర క్రితం నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని సుమారు రూ.95 వేల బిల్లును విద్యాశాఖాధికారి ద్వారా ప్రభుత్వానికి పంపారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన ఉద్యోగి ఒకరు ఏడాది క్రితం ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గుండే ఆపరేషన్‌ చేయించుకుని రూ.50 వేలకు బిల్లు పెట్టారు. వీరిద్దరే కాకుండా కొన్ని వందల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మెడికల్‌ బిల్లుల కోసం (రీయంబర్స్‌మెంటు) నెలల తరబడి ఎదురుచూస్తు న్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్‌ఎస్‌) కార్డు చూపించినా... చాలా ప్రైవేటు ఆస్పత్రులు వైద్యం చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులు సొంత డబ్బు చెల్లించి చికిత్స పొందుతు న్నారు. ఆ బిల్లులను సంబంధిత శాఖల ద్వారా ప్రభుత్వానికి పంపినా ఏడాదిన్నరగా డబ్బులు రాలేదు. ఇప్పటి వరకూ ప్రభుత్వం రూ.213 కోట్లను బిల్లులు రూపంలో చెల్లించాల్సి ఉందని సమాచారం. రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల జీతం బట్టి ప్రతినెలా రూ.225 నుంచి రూ.300 వరకూ ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ పథకానికి ప్రభుత్వం జమచేస్తోంది. ఉద్యోగులు హెల్త్‌ కార్డు ద్వారా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే కొన్ని ఆస్పత్రుల్లో వైద్యం అందడం లేదు. ఆ ఆస్పత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడమే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ముందు డబ్బు చెల్లించి... ఆ తరువాత రీయంబర్స్‌మెంటు కోసం ప్రభు త్వానికి బిల్లులు పెట్టుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. రూ.50 వేలు వరకూ అయితే జిల్లా స్థాయి అధికారి ద్వారా జిల్లా స్థాయి మెడికల్‌ బోర్డుకు బిల్లులు పంపిస్తారు. అక్కడ స్క్రూట్నీ అనంతరం తిరిగి జిల్లా అధికారికి పంపిస్తారు. ఆ తరువాత సంబంధిత ఉద్యోగి బిల్లును ట్రెజరీ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తారు. అదే బిల్లు రూ.50 వేలు దాటితే నేరుగా సంబంధిత శాఖ విభాగాధి పతి ద్వారా రాష్ట్రస్థాయి మెడికల్‌ బోర్డుకు పంపాలి. అక్కడ పరిశీలించిన తరువాత తిరిగి రాష్ట్ర స్థాయి విభాగాధిపతికి, అక్కడ నుంచి జిల్లా అధికారికి చేరుతుంది. అది ఉద్యోగి లాగిన్‌కు వస్తే దాని నకలు తీసుకుని ట్రెజరీ ద్వారా క్లెయిమ్‌కు దర ఖాస్తు చేసుకోవాలి. ట్రెజరీ ద్వారా వెళ్లిన బిల్లులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి సిఎంఎఫ్‌ఎస్‌ ద్వారా ఉద్యోగి వ్యక్తిగత ఖాతాకు జమ చేయాలి. బిల్లు సొమ్ము ఉద్యోగి ఖాతాకు రావడానికి గతంలో నాలుగైదు నెలలు పట్టేదని, ప్రస్తుతం ఏడాదిన్నరగా రావడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.