
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : జిల్లావ్యాప్తంగా 151 ఎపి ఆన్లైన్ సెంటర్లు, అర్బన్ ప్రాంతాల్లో 192, రూరల్ ప్రాంతాల్లో 984 కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 250 రకాల సేవలు అందిస్తున్నారు. ఈ సేవలన్నీ ప్రస్తుతం కుదించబడ్డాయి. గతంలో రోజుకు సరాసరి లక్షా 25 వేల ట్రాన్స్క్షన్స్ జరిగేవి. వీటి ఆధారంగా దాదాపు రెండు వేల మంది ఆపరేటర్లు, సహాయకులు కొంతమేర ఉపాధిని పొందుతూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. జనన, మరణ, కుల ధ్రువీకరణ పత్రాల సేవలతో పాటు, రెవిన్యూ, వ్యవసాయ, విద్యుత్, ఆరోగ్యం, పోలీస్ పలు ప్రభుత్వ శాఖలకు చెందిన సేవలు వీటి ద్వారానే ప్రజలకు అందేవి. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, కొత్త కార్డులకు దరఖాస్తులు వంటి పనులు కూడా ఇక్కడే జరిగేవి. ఇందుకు ఆయా కాంట్రాక్టు సంస్థల నుంచి ఒక్కో సేవకు ఒక్కోలా చాలా తక్కువ కమిషన్ అందించేవి. ఒక్కో సెంటర్కు రూ.లక్షా 50 వేల నుంచి రూ.ఐదు లక్షల వరకూ అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ నిరంతరాయంగా సర్వీసులు అందించేవారు.
'మీ సేవ'లకు మంగళం
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి మీ-సేవల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కరోనా సమయంలో మూతబడిన ఈ కేంద్రాలను శాశ్వతంగా మూసివేసి అన్ని పౌర సేవలనూ సచివాలయాలకు అప్పగించడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని నిర్వాహకులు వాపోతున్నారు. దీంతో ప్రభుత్వపరంగా రామ్ ఇన్ఫోటెక్ ద్వారా జిల్లాలో నడుస్తున్న మీ సేవ కేంద్రాలు గత మార్చి నుంచి మూతపడ్డాయి. తాజాగా అక్టోబరు 1నుంచి మళ్లీ తెరిచారు. రూరల్లో ప్రాంచైజీ కేంద్రాలు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ కేంద్రాల నిర్వాహకులు సహా అర్బన్ ప్రాంతాల్లో రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి తెరిచిన పలు కేంద్రాల నిర్వాహకులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ద్వారా బిడ్ పొంది రామ్ ఇన్ఫో టెక్ కాంట్రాక్టు పొందిన 26 కేంద్రాలు పని చేస్తున్నాయి. ఇవి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, తుని, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరంలో ఉన్నాయి. వీటిల్లో పర్యవేక్షణకు ఒక జిల్లా కో ఆర్డినేటర్, ఒక్కో సెంటర్కు ఒక మేనేజర్, సేవలను బట్టి కేంద్రాల్లో ఒక కంప్యూటర్ ఆపరేటర్ నుంచి ముగ్గురేసి చొప్పున మొత్తం 60 మంది ఉద్యోగులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. వీరికి కాంట్రాక్టు సంస్థ నుంచి ఇప్పటికే జీతాలు నిలుపుదల చేశారు. ఉద్యోగ భద్రత కోల్పోయిన తమను సచివాలయాల్లో సర్దుబాటు చేయాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.