Oct 27,2021 19:45

ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటున్న విద్యార్థులు
ఎయిడ్‌ అయినా కొనసాగించాలని వినతి
ప్రజాశక్తి - ఏలూరు కల్చరల్‌
దాతల ఉదారత్వం, విద్యాభిలాషుల సహకారంతో 76 సంవత్సరాలు నిరాటంకంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందించిన కెపిడిటి విద్యాసంస్థ నేడు అంపశయ్యపై ఉంది. దీంతో ఆ పాటశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
స్వాతంత్రానికి పూర్వమే 1945లో ఏలూరులోని అశోక్‌నగర్‌కు చెందిన 'ది ఏలూరు కోఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ లిమిటెడ్‌' ద్వారా సుమారు రెండున్నర ఎకరాల స్థలాన్ని 'దివ్య జ్ఞాన విద్యా సమితి' అనే ట్రస్ట్‌కు దానం చేయగా ఎంతోమంది దాతల సహకారంతో తాత్కాలికంగా పాకలు వేసి శ్రీమతి కొండ పార్వతిదేవి థియోసాఫికల్‌ పాఠశాలగా నామకరణం చేసి ప్రారంభించారు. అనంతరం ఈ పాఠశాలకు అప్పటి ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇవ్వడంతో 46 మంది ఉపాధ్యాయులు, 15 మంది ఉపాధ్యాయేతర సిబ్బందితో దేదీప్యమానంగా ఈ పాఠశాల సాగింది. నాటి నుంచి 76 సంవత్సరాలుగా అనేక వేల మంది విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగారు ప్రస్తుత మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, ఆధ్యాత్మిక ప్రవచనకారులు చాగంటి కోటేశ్వరరావు, సినీ నటుడు సుధాకర్‌, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ రిటైర్డ్‌ డిజిఎం జివి శేషు, ప్రస్తుత డిఆర్‌ఒ వి.డేవిడ్‌రాజు ఈ పాఠశాలలో చదువుకున్న వారే. ఏలూరు నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాలైన చొదిమెళ్ల, వంగూరు, లక్ష్మీపురం, శనివారపుపేట, సోమవరప్పాడు తదితర గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడికొచ్చి చదువుకునే వారు. అంతేకాక ఈ పాఠశాలకు కేవలం కిలోమీటరు దూరంలో సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతిగృహాలు ఉండటంతో కొల్లేరు గ్రామాలైన కొక్కిరాయిలంక, దోసపాడు, కొవ్వలి, పోతునూరు, గుడివాకలంక, మొండికోడు, ప్రత్తికోళ్లలంక, శ్రీపర్రు తదితర గ్రామాల విద్యార్థులు ఇక్కడ వసతిగహాల్లో ఉండి ఈ పాఠశాలలో విద్య అభ్యశించేవారు. గత 20 సంవత్సరాలుగా ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ 17 మంది ఉపాధ్యాయులు ఎయిడెడ్‌ పోస్టుల్లో, మరో ఏడుగురు అన్‌ఎయిడెడ్‌ పోస్టుల్లోనూ కొనసాగుతున్నారు. ఉపాధ్యాయుల సంఖ్య తగ్గడంతో తొమ్మిది వందల వరకు వరకు ఉండే విద్యార్థుల సంఖ్య నేడు 280కు పడిపోయింది. ఇదే సంస్థ ఆధ్వర్యాన 1975లో శ్రీమతి పానాదేవి భర్తియా థియోసాఫికల్‌ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రభుత్వం ఎయిడెడ్‌ పాఠశాలలను, కళాశాలలను ప్రభుత్వంలో విలీనం చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వ గ్రాంటు నిలిపివేస్తామని జిఒ విడుదల చేసింది. విలీనానికి అంగీకరించని విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఎయిడెడ్‌ సిబ్బందిని వెనక్కిచ్చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో కొన్ని యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లాయి. ఈలోపు విలీనానికి అంగీకరించని యాజమాన్యాలు సిబ్బందిని వెనక్కిచ్చేందుకు అంగీకరించాయి. డిగ్రీ కళాశాలల్లోని ఎయిడెడ్‌ అధ్యాపకులు ప్రభుత్వంలో విలీనం కావడం, వారికి వివిధ ప్రభుత్వ కళాశాలల్లో పోస్టింగులు ఇవ్వడం పూర్తయ్యింది. జూనియర్‌ కళాశాలలు, పాఠశాలల్లో ఈ ప్రక్రియ సాగుతోంది. సిబ్బందిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్ని పాఠశాలలు మూతపడుతున్నాయి. అదే పరిస్థితి ఏలూరులోని కెపిడిటి విద్యాసంస్థలకు నెలకొంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు గళమెత్తుతున్నాయి. కెపిడిటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించి పేదలకు విద్య అందించాలని కోరుతున్నారు. గత సోమవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన కూడా చేపట్టారు.
విద్యార్థులు నష్టపోకుండా చూడాలి
డాక్టర్‌ వి.రాజేంద్రసాద్‌, రిటైర్డ్‌ మున్సిపల్‌ ఆర్‌డి
నేను ఈ పాఠశాలలోనే చదివి ఉన్నతోద్యోగం చేశాను. 76 సంవత్సరాల చరిత్ర కలిగి, ఎంతోమంది ఉన్నతస్థాయికి ఎదిగేందుకు ఉపయోగపడిన ఈ పాఠశాలను మూసివేయడం బాధాకరం. పేద విద్యార్థులకు అండగా ఉన్న ఈ పాఠశాలను కొనసాగించేందుకు అటు ప్రభుత్వం, ఇటు యజమాన్యం చొరవ చూపాలి. ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా విద్యార్థులు నష్టపోకుండా చూడాలి.
ప్రభుత్వంలో విలీనం చేసి కొనసాగించాలి
కె.సౌజన్య, 8వ తరగతి విద్యార్థిని
టిసి తీసుకుని వేరే పాఠశాలలో చేరాలని శనివారం మాకు ఉపాధ్యాయులు చెప్పారు. మాది పేద కుటుంబం. ప్రయివేట్‌ పాఠశాలలో చదివించే స్తోమత మా తల్లిదండ్రులకు లేదు. అందువల్ల ఈ పాఠశాలను ప్రభుత్వంలో విలీనం చేసి కొనసాగించాలి.
ప్రయివేటు పాఠశాలలకు వెళ్లే స్థోమత లేదు
జె.కిరణ్‌కుమార్‌, పదో తరగతి విద్యార్థి
మాది కైకరం. హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. మా హాస్టల్‌కు దగ్గరగా ఉన్న పాఠశాల ఇదే. వేరే ప్రయివేటు పాఠశాలలకు వెళ్లి చదువుకునే అవకాశం లేదు. అంత స్థోమత కూడా లేదు. ఈ పాఠశాలను ప్రభుత్వంలో విలీనం చేసి కొనసాగించాలి.
ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు
ఇ.దుర్గ, విద్యార్థి తల్లి
20 సంవత్సరాల క్రితం నేను కూడా ఈ పాఠశాలలోనే చదివాను. మా మామగారు కూడా ఇక్కడే చదివారు. మేము కూలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవడం వల్ల ప్రయివేట్‌ పాఠశాలలో చదివించే స్థోమత లేదు. టిసి తీసుకుని వెళ్లమంటున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. ఈ పాఠశాలను కొనసాగిస్తే పేద విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుంది.