Jun 11,2021 09:40

గువహటి : అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. భారత్‌కు వలస వచ్చిన ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించి... వారి జనాభాను నియంత్రిస్తే భూ ఆక్రమణ వంటి సామాజిక సమస్యలు పరిష్కారమౌతాయని అన్నారు. అలా కాదని జనాభా పెరుగుదల కొనసాగిస్తే... అసోంలో ప్రసిద్ధ కామాఖ్య దేవాలయం భూమి కూడా ఆక్రమణకు గురౌతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన ఇల్లు కూడా ఆక్రమణకు గురౌతుందని... వారినుద్దేశించి ఎద్దేవా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నెల రోజులు అయింది. అయితే భూ ఆక్రమణ వ్యతిరేక డ్రైవ్‌లో భాగంగా పాత్రికేయ సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఇక్కడ మధ్య, దిగువ అసోంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలను బంగ్లాదేశ్‌ నుండి వలస వచ్చిన ముస్లింలుగా భావిస్తారు. వీరే అధికంగా నిరాశ్రయులుగా ఉన్నారు. ఇప్పుడు వారినుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. వీరి వల్ల అక్కడి ప్రజలు ఉనికిని కోల్పోతున్నారని బిజెపి నేతృత్వంలోని సర్కార్‌ వాదన. ఇప్పటికే గత అసెంబ్లీ సమావేశంలో జనాభా విధానాన్ని రూపొందించామని, ఇంకా జనాభా భారాన్ని తగ్గించేందుకు మైనార్టీ ముస్లిం వర్గాలతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని అన్నారు. మీ జనాభా పెరుగుదలే పేదరికం, భూ ఆక్రమణ వంటి సామాజిక భయాందోళనలకు కారణమని అన్నారు. వైష్ణవ మఠాలకు చెందిన భూములను, అడవులను, దేవాలయ భూములను ఇచ్చేది లేదని హిమంత అన్నారు. దీనికి రాష్ట్రంలోని జనాభా పెరుగుదలే కారణమని అన్నారు. దీన్ని తగ్గించినప్పుడే సామాజిక సమస్యలు తగ్గించగలమని చెప్పారు. వలస వచ్చిన ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించాలని కోరారు. ఈ సమస్యపై బద్రుద్దీన్‌ అజ్మల్‌ పార్టీ ఎఐయుడిఎఫ్‌, ఆల్‌ అసోం మైనార్టీ స్టూడెంట్స్‌ యూనియన్‌తో చ్చించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ ప్రకటనపై ఎఐయుడిఎఫ్‌ జనరల్‌ కార్యదర్శి, ఎమ్మెల్యే అనిమల్‌ ఇస్లాం మండిపడ్డారు. ఇది ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. జనాభా విధానాన్ని రూపొందించినప్పుడు తాము వ్యతిరేకించలేదని, వలస వచ్చిన ముస్లింలనే టార్గెట్‌ చేస్తూ జనాభా పెరుగుదల గురించి చర్చించడం సరికాదని అన్నారు.