Oct 28,2021 21:06

ప్రజాశక్తి - ఆచంట
ఆరుగాలం కష్టించే రైతన్నకు వరిసాగులో అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, ఎరువుల భారం, అందని మద్దతు ధరతోపాటు ఎలుకల దాడితో పంట దెబ్బతిని కుదేలవుతున్నారు.
ప్రస్తుతం సార్వా వరిపై ఎలుకల దాడి తీవ్రంగా ఉంది. ఆచంట నియోజకవర్గంలో వర్షాల కారణంగా సార్వా సాగు ఆలస్యమైంది. ప్రస్తుతం పంట దుబ్బు, ఈనిక దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఎలుకలు విజృంభిస్తున్నాయి. నియోజకవర్గంలోని ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు మండలాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఒక ఎలుక ఒక రాత్రిలో సుమారు 20 నుంచి 30 దుబ్బులను కొరికి నష్టపరుస్తోంది. దీంతో దిగుబడిపై ప్రభావం చూపుతోంది. ఎలుక కన్నంలో పొగ పెట్టడం, ఎలుకల బుట్టల ద్వారా పట్టుకోవడం, నివారణ మందులు వినియోగించడం వంటి పద్దతులను రైతులు అవలంబిస్తున్నారు. మరికొందరైతే రాత్రివేళల్లో పొలం చుట్టూ విద్యుత్‌ తీగలు చుట్టి ఎలుకలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ఎలుకను చంపడానికి సుమారు రూ.వంద వరకూ వెచ్చించాల్సి వస్తోందని, ఎకరాకు సుమారు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని రైతులు లబోదిబోమంటున్నారు. దీనికితోడు ఎలుకలు కొరికిన పైరును పంట పొలాల్లో నుంచి ఎప్పటికప్పుడు తొలగించేందుకు అదనంగా కూలీలను పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు.
నివారణకు వ్యవసాయాధికారుల సూచనలు ఇవే
పొలం గట్టుపై బొరియల్లో ఉండే ఎలుకలు రాత్రి వేళల్లో పొలంలోకి వస్తాయి. ఎలుకల నివారణకు రైతులంతా సామూహికంగా చర్యలు తీసుకోవాలి. ఒక రైతు నివారణా చర్యలు తీసుకుని పక్క రైతు తీసుకోకుంటే ఎలుకల నివారణ అసాధ్యం.
వరి దుబ్బులను ఎలుకలు కొరికి వేయడం వల్ల పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. చిరు పొట్ట దశ రాకుండానే ఎలుకల నిర్మూలన జరగాలి.
నివారణా చర్యలు చేపట్టాలి..
కె.రాజశేఖర్‌, మండల వ్యవసాయాధికారి
పొలాల్లో విషపూరిత పురుగు మందులు అధిక మోతాదు వాడటం వల్ల ఎలుకల సహజ శత్రువులైన పాము, గుడ్లుగూబ, పిల్లి, ముంగిస వంటివి చనిపోతున్నాయి. తద్వారా ఎలుకలు ఉధృతి పెరుగుతుంది. రైతులంతా సామూహికంగా ఎలుకల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడితోపాటు అధిక ఆదాయం సమకూరుతుంది. దీనికితోడు ఖర్చు తగ్గుతుంది.