Jun 11,2021 06:55

'సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నాం. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమం కోసమే నిరంతరం శ్రమిస్తున్నాం' అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఫ్రంట్‌లైన్‌ వారియర్లనే పేరుతో మున్సిపల్‌, పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, పోలీసులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న ప్రభుత్వాలు వారి కష్టాలను తీర్చి ఆదుకోవడంలో మాత్రం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు.

   రోనా మహమ్మారి రెండవ దశ ప్రజలందరినీ భయకంపితులను చేస్తున్నప్పటికీ మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కార్మికులు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస రక్షణ పరికరాలైన మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్‌, పిపిఇ కిట్లు వంటివి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీని మూలంగా గత నెల రోజుల్లో విశాఖలో 11 మంది, అనంతపురం, విజయవాడల్లో ముగ్గురేసి చొప్పున, కడపలో ఇద్దరు... ఈ రకంగా అన్ని పట్టణాలలో కరోనా బారినపడి చనిపోయారు. కరోనా కారణంగా గాని, కరోనా కాలంలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు గాని సుమారు 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా కాలంలో మరణించిన వారికి కేంద్ర ప్రభుత్వం గరీబ్‌ కళ్యాణ్‌ ఇన్సూరెన్స్‌ పథకం కింద 50 లక్షల రూపాయల బీమా చెల్లిస్తామని గత ఏడాది ప్రకటించింది. కానీ నేటికీ ఏ ఒక్కరికి ఈ బీమా అందించలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం వారి బిడ్డలకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ కార్మికుల కుటుంబాలన్నీ కటిక దరిద్రం అనుభవిస్తున్నాయి.
 

                                                         వికటించిన 'ఆప్కాస్‌' సంజీవని

   రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో వున్నప్పుడు... తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేసి తీరుతామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. గద్దెనెక్కి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగాల పర్మినెంటు విషయమై ఉలుకూ పలుకూ లేదు.
    ఒప్పంద కార్మికులకు సర్వరోగ నివారిణి అంటూ రాష్ట్ర ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ సర్వీసెస్‌' (ఆప్కాస్‌) పేరుతో ప్రభుత్వ అధీనంలోనే ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసింది. దీనిద్వారా కార్మికులకు ప్రతి నెలా 5వ తేదీ లోపు జీతాలు చెల్లిస్తామన్న హామీ మున్సిపల్‌ కార్మికులకు ఎక్కడా అమలు కావడం లేదు. 2 నుండి 7 నెలల జీతాలు బకాయిలు ఉండగా పారిశుధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న 'ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌' 2 నుండి 9 నెలలు బకాయిలున్నాయి. బకాయి జీతాల కోసం కూడా సమ్మె పోరాటాలు చేయాల్సిన దుస్థితిని ప్రభుత్వాలు తెచ్చిపెట్టాయి. జీతాలు సకాలంలో రాకపోవడం వల్ల ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద ఐదు నుండి పది రూపాయలు చెల్లించి అప్పులు తెచ్చుకొని కార్మికులు బతకాల్సి వస్తోంది.
    'ఆప్కాస్‌' విధానం అమలు లోకి వచ్చి ఏడాది కావస్తోంది. తమను 'ఆప్కాస్‌' నుండి మినహాయించి ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలని మున్సిపల్‌ కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కార్మికుల కోరికను పెడచెవిన పెట్టింది. ఇ.పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ. వాటా నిధులు కార్మికుల ఖాతాలలో జమ కావడం లేదు. ఇ.పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ ల ద్వారా ఒనగూడే ప్రయోజనాలను కార్మికులు కోల్పోతున్నారు. అనారోగ్యం పాలైన కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఇఎస్‌ఐ వారు వైద్యం నిరాకరిస్తున్నారు. ఫలితంగా కార్మికులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. పైగా ప్రభుత్వ వెబ్‌సైట్‌ లో మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను 'ఉద్యోగులు'గా నమోదు చేసింది. దీనితో 60 ఏళ్లు దాటిన వారిని ఏ విధమైన రిటైర్మెంట్‌ బెనిఫిట్లు చెల్లించకుండానే నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. విశాఖ నగరంలో 250 మంది, విజయవాడలో 60, నెల్లూరు జిల్లాలో 30 మంది...ఈ విధంగా అన్ని పట్టణాలలోను కార్మికులను తొలగించారు. వితంతు పెన్షన్‌ పొందుతున్న మహిళా కార్మికులను ఒక వ్యక్తి రెండు ప్రభుత్వ ఆదాయాలు పొందటానికి వీలులేదనే సాకుతో ఉద్యోగాల నుండి తొలగించారు. సాధారణంగా మృతి చెందిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి బిడ్డలకు గతంలో స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ లేదా పాలకవర్గాలు మానవతా దృక్పథంతో ఉద్యోగాలు కల్పించేవారు. ప్రస్తుతం అధికారాలన్నీ 'ఆప్కాస్‌' కు కట్టబెట్టడం వల్ల గత పది నెలలుగా సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల పని చేస్తున్న కార్మికులపై అదనపు భారం పడుతోంది. ఇవికాక 'ఆప్కాస్‌' లో చేర్చేటప్పుడు కార్మికుల పేర్లు తప్పుల తడకలతో ఇవ్వడం మూలంగా ప్రతి పట్టణంలో 10 నుంచి 20 మంది వరకు 7-8 నెలలుగా జీతాలు పొందలేక వారి కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. ఉద్యోగులనే పేరుతో 'అమ్మ ఒడి' వంటి సంక్షేమ పథకాలను మున్సిపల్‌ కార్మికులకు అమలు చేయడం లేదు.
 

                                                      పని భారం-దెబ్బతింటున్న ఆరోగ్యాలు

   పట్టణాలలో ప్రతి యేటా 5 శాతం వ్యర్థాల పరిమాణం పెరుగుతోందని 2010లో ప్రభుత్వాలు లెక్కలుగట్టాయి. గడిచిన పదేళ్లలో ఘన, ద్రవ వ్యర్థాల పరిమాణం మరింత పెరిగింది. కానీ ఆ మేరకు కార్మికుల సంఖ్యను పెంచడం లేదు. ఒక మైక్రో ప్యాకెట్‌ (350 ఇళ్లకు) పరిధిలో నలుగురు కార్మికులు పని చేయాల్సి ఉండగా ఒకరిద్దరితో పని చేయిస్తున్నారు. కొన్ని పట్టణాలలో ఒక్కరితోనే పని చేయిస్తున్నారు. దీనికితోడు ప్రతిరోజు 10 కిలోల ప్లాస్టిక్‌ తెచ్చి ఇవ్వాలని కార్మికులపై టార్గెట్లు పెడుతున్నారు. తడి చెత్త-పొడి చెత్త వేరు చేయాలని...లేదంటే జీతాల్లో కోత పెడతామని బెదిరిస్తున్నారు. పోనీ పని చేయడానికి అవసరమైన నాణ్యమైన పనిముట్లను సకాలంలో అందిస్తారా అంటే అదీ లేదు. కార్మికులు వాటిని కొని తెచ్చుకొని పని చేస్తున్నారంటే స్వచ్ఛభారత్‌, పర్యావరణం, పరిరక్షణ వంటి వాటి గురించి రోజూ గొప్పలు చెప్పే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కార్మికులపై పనిభారం, అధికారుల వేధింపులు పెరగడం వల్ల మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారు.
 

                                                     బలవంతపు బదలాయింపు ఆపాలి

   పట్టణాల విస్తరణ మేరకు కార్మికుల సంఖ్యను పెంచే విషయంలోగానీ, కనీసం కరోనా సమయంలో రక్షణ పరికరాలు అందించడంలో, భద్రత సౌకర్యాలు కల్పించడంలో, పనిముట్లు అందించడంలోగాని ఏ మాత్రం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను మాత్రం బలవంతంగా సచివాలయాలకు బదలాయించాలని పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తోంది. సచివాలయ వ్యవస్థ పర్మినెంటు ఉద్యోగులతో కూడినదని ప్రభుత్వం గొప్పగా చెబుతుంటుంది. మరి అటువంటప్పుడు ఆ సచివాలయాలకు బదలాయిస్తున్న మున్సిపల్‌ కార్మికులు తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని, సిబ్బంది సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఇవేవీ ప్రభుత్వం చెవికి ఎక్కించుకోవడం లేదు.
హామీలను అటకెక్కిస్తున్నారు
   కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రితో సహా అధికారులందరికీ పదే పదే విన్నవించినా ఏమాత్రం స్పందన లేదు. ఈ సమస్యల పరిష్కారం కోసం 4.8.2020, 15.2.2021 తేదీలలో ఒక రోజు సమ్మె పోరాటాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడడం లేదు. పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కార్మికుల ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలని, ఇంజనీరింగ్‌ విభాగంలోని 36 రకాల కార్మికులకు హెల్త్‌ అలవెన్సు ఇవ్వాలని, కరోనా కాలంలో ప్రాణాలొడ్డి పనిచేస్తున్న కార్మికులకు నెలకు 25 వేల రూపాయల పారితోషికం చెల్లించడానికి సంబంధించి...గత ఆగస్టు 4 సమ్మె సందర్భంగా నాటి డి.ఎం.ఎ...రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఇది కాకుండా ఇంజనీరింగ్‌ కార్మికులకు, స్కూల్‌ స్వీపర్లకు నాలుగేళ్లుగా జీతాలు పెరగలేదు. వీరి జీతాలు పెంచుతామని గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం వాగ్దానం చేస్తూనే ఉన్నది. ఎన్‌.ఎం.ఆర్‌ లకు కరువు భత్యం, ఐ.ఆర్‌ లు చెల్లించడం లేదు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. 2018 అక్టోబర్‌లో జరిగిన ఐదు రోజుల సమ్మె సందర్భంగా నాడు ప్రభుత్వం 2019 జనవరి నుండి సమాన పనికి సమాన వేతనం అమలుకు చర్యలు తీసుకుంటామని లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీ నేటికీ నెరవేర్చలేదు.
 

                                                        గత్యంతరం లేకనే సమ్మె బాట

   'సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నాం. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమం కోసమే నిరంతరం శ్రమిస్తున్నాం' అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఫ్రంట్‌లైన్‌ వారియర్లనే పేరుతో మున్సిపల్‌, పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, పోలీసులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న ప్రభుత్వాలు వారి కష్టాలను తీర్చి ఆదుకోవడంలో మాత్రం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. స్వచ్ఛభారత్‌ సైనికులని, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేస్తున్నారని ప్రధాన మంత్రి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద పోసుకున్నారు. పూలు చల్లించి, చప్పట్లు కొట్టించి దులిపేసుకున్నారు. కార్మికులకు కష్టాలు మాత్రం తప్పడం లేదు.
    మరోవైపు పట్టణ సంస్కరణల పేరుతో పట్టణ ప్రజానీకం మీద చెత్త పన్ను, ఆస్తిపన్ను వంటి భారాలు మోపి కష్టాలపాలు చేస్తున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నది. ఆ ప్రజల్లో భాగస్వాములైన మున్సిపల్‌ కార్మికులు వృత్తిపరంగా వచ్చే సమస్యలతో పాటు నివాస ప్రాంతాల్లో వచ్చే సమస్యలు కూడా వారి కుటుంబాలను మరింత దయనీయంగా మార్చేస్తున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మే నెల 20వ తేదీన సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ఏమాత్రం చలనం లేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి చేదోడుగా ఉన్న మున్సిపల్‌ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 14, 15 తేదీల్లో సమ్మె బాట పట్టాల్సి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని సమస్యలు పరిష్కరిస్తాయో లేదో చూడాలి. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి జరుగుతున్న సమ్మె పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతునిచ్చి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా వుంది.


(వ్యాసకర్త ఎ.పి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, ఎ.పి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి)

కె. ఉమామహేశ్వరరావు

కె. ఉమామహేశ్వరరావు