Mar 02,2021 23:38

మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌

జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌
ప్రజాశక్తి - నంద్యాల:
 నంద్యాల మున్సిపల్‌ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌, జిల్లా నాయకులు మస్తాన్‌వలి ప్రజలను కోరారు. మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నంద్యాల పట్టణంలో ప్రతి సంవత్సరం వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని అన్నారు. వరద రక్షణ గోడలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కాలువలు నిర్మించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు, నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. పట్టణంలో సగభాగం మంచినీటి కొరత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండు సంవత్సరాలుగా ఇసుక కొరతతో వేలాదిమంది కార్మికులు, బిల్డింగ్‌ యజమానులు, బిల్డింగ్‌ మెటీరియల్స్‌ వ్యాపారస్తులు తీవ్ర నష్టాలపాలయ్యారని అన్నారు. కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. పట్టణంలో ఇంటి పన్నులు రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని, ఏప్రిల్‌ నెల నుంచి ప్రతి ఇంటికి పది రెట్ల పన్ను రాబోతుందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా సిపిఎం అనేక ఆందోళనలు కూడా నిర్వహించిందని, చెత్త, మురికి కాలువలు, మంచినీటి పన్నులు కూడా అదనంగా వేశారని చెప్పారు. నేటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింలకు దులహన్‌ పథకం, హిందువులకు పెళ్లికానుక పేరుతో ఇస్తామన్న డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భతి ఇచ్చిందని, దాన్ని పెంచి వైఎస్సార్‌ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగ భతి ఇస్తామని ఎన్నికల వాగ్దానాలు చేసింది కానీ ఇంతవరకు ఆ ఊసే మాట్లాడలేదన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం సిపిఎం పోరాడుతున్నదని, పట్టణ ప్రజల సమస్యలపై మాట్లాడే వారిని ముఖ్యంగా సిపిఎం, సిపిఐ అభ్యర్థులను, మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వారిని గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు.