Oct 27,2021 18:33

ప్రజాశక్తి - ఉంగుటూరు
          తాడిపూడి కాలువ ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని, ఈ విషయంలో తాడిపూడి ఎత్తిపోతల పథకం ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ముందు బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తికొండ వెంకట కృష్ణారావు, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడారు. గొల్లగూడెం వద్ద తాడిపూడి కాలువ పల్లపుప్రాంతం కావడంతో వరదనీరు ఒకేసారి రావడంతో గండ్లు పడి పంటలు ముంపునకు గురై రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గొల్లగూడెం, కొత్తగూడెం, తిమ్మయ్యపాలెం, కైకరం తదితర గ్రామాల్లో తాడిపూడి కాలువ ముంపు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ముంపునివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వంగానీ, అధికారులుగానీ పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు వేములపల్లి సుధీర్‌, ముళ్లపూడి సుబ్బారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి కె.వెంకట్రావు, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు ఎన్‌.మదన్మోహనరావు, కౌలు రైతుల సంఘం జిల్లా కో కన్వీనర్‌ కొర్ని అప్పారావు, జిల్లా నాయకులు వెజ్జు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు బొల్లిన నాగేశ్వరావు, ముళ్లపూడి మాధవరావు, తుంపాటి సత్యనారాయణ, ముళ్లపూడి రామ్మోహన్‌రావు, మలకలపల్లి ధనుంజయరావు, అల్లాడ గంగాధరరావు, మలకలపల్లి వేణు పాల్గొన్నారు.