Dec 27,2020 11:42

ముల్లంగి భూమిలో పండుతుంది కాబట్టి దీన్ని రూట్‌ వెజిటబుల్‌ అంటారు. ఇది ఎక్కువగా శీతాకాలంలో లభిస్తుంది. ముల్లంగి వాసన కొందరికి అంతగా నచ్చదు. కాస్త వగరుగా, ఘాటుగా ఉండే ముల్లంగి ఆరోగ్యానికి రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇందులో మేలుచేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే చక్కని ఆరోగ్యం మన సొంతమవుతుంది.


కామెర్లు : ముల్లంగి కాలేయంను మంచి కండిషన్‌లో ఉంచుతుంది. శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే ఎర్ర రక్తకణాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. ముల్లంగి ఆకులను కామెర్ల నివారణకు ఉపయోగిస్తారు.
మొలలు : ముల్లంగికి శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మొలల నివారణకు బాగా సహాయపడుతుంది.
మూత్ర సంబంధిత వ్యాధులు : ముల్లంగిలో ఉండే డ్యూరెటిక్‌ శరీరంలో మూత్రం ఉత్పత్తి చేయడానికి సహాయ పడుతుంది. శరీరంలో ఏర్పడే మలినాలను తొలగించడానికి, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌ను తగ్గించడానికి, మూత్రవిసర్జన సమయంలో ఏర్పడే మంటను నివారించడానికి ఉపయోగపడుతుంది. ముల్లంగిని తరచూ తీసుకోవడం వల్ల కిడ్నీలు, యూరినరీ సిస్టమ్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా కాపాడుతుంది.
క్యాన్సర్‌ : ముల్లంగిని రోజూ తీసుకోవడం వలన కోలన్‌ క్యాన్సర్‌, జీర్ణాశయ క్యాన్సర్‌, కిడ్నీ కాన్సర్‌, ఓరల్‌ క్యాన్సర్‌ను రాకుండా కాపాడుతుంది.
కిడ్నీ : ముల్లంగి మూత్రపిండాల వ్యాధు లను నియంత్రిస్తుంది. ఎందుకంటే దీనిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలోని చెడు పదార్థాలను తొలగించడానికి, రక్తాన్ని శుభ్రపరచడానికి, మూత్రపిండాలు సక్రమంగా పనిచేసేందుకు సహాయపడతాయి.
జ్వరం : ముల్లంగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ముల్లంగి రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగడం వల్ల జ్వరానికి కారణమయ్యే లక్షణాలతో పోరాడి, జ్వరాన్ని తగ్గిస్తుంది.
శ్వాస సంబంధ సమస్యలు : ముల్లంగి శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా ముక్కు, గొంతు, శ్వాసనాళంతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, దగ్గు, అలర్జీ మరియు కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను నివారిస్తుంది. శ్వాసనాళం బాగా పనిచేసేలా చేస్తుంది.