Jan 14,2021 09:35

బిహార్‌ : దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, యువతులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకున్న కొంతమంది చిన్నా పెద్దా తేడా లేకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా బిహార్‌లో సభ్యసమాజానికి తలదించుకునే ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూగ బాలికపై అత్యాచారం చేసి అత్యంత హేయంగా ఆమె కళ్లను పొడిచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రం మధుబని జిల్లా కవాహ బర్హి గ్రామానికి చెందిన మూగ, చెవిటి బాలిక రోజూ వారీగా మేకలను మేపేందుకు వెళ్లింది. ఎప్పటి నుంచో ఆమెపై కన్నేసిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహికంగా లైంగిక దాడి చేశారు. అనంతరం వారిని గుర్తు పట్టకూడదని ఆమె కళ్లను పొడిచేశారు. బాలికతో ఉన్న మరొకరు విషయాన్ని ఆమె ఇంటికి వెళ్లి చెప్పారు. వారు వచ్చేసరికి ఆ బాలిక బీడు భూమిలో పడి బాధతో విలవిలలాడుతోంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.