Apr 07,2021 19:26

కర్ణాటక బళ్లారికి చెందిన నికితా అయ్యర్‌ 2015లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది. ఈమె ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు వీరి కుటుంబం చెన్నై నుంచి బళ్లారికి వచ్చింది. ఆ సమయంలో వారి ఇంటి సమీపంలో ఒక కుక్కకు ఆరు పిల్లలు పుట్టాయి. వాటన్నింటినీ నికితా కుటుంబమే చూసుకుంది. ఆ కుక్కలన్నీ వ్యాధికి గురై ఒక్క కుక్కపిల్ల తప్ప అన్నీ చనిపోయాయి. మూడునెలలున్న ఆ కుక్క వ్యాధి నుంచి కోలుకొని ఆరోగ్యవంతంగా ఎదిగింది. దీనికి నికిత గుండప్ప అని పేరుపెట్టింది. నాలుగేళ్ల వయసులో మరో వ్యాధినుంచి బయటపడింది. కానీ, 2012 ఒకరోజు తాగుబోతులు కలిపిన విషాహారాన్ని గుండప్ప తిన్నది. నికిత కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.


ఆ రోజు నికిత మౌనంగా బాధపడింది. మూగ జీవుల సంరక్షణ కోసం తాను ఏమైనా చేయాలని నిర్ణయించుకొంది. 2012లో కేర్‌ (కన్వర్జేన్‌ అండ్‌ రెస్క్యూ)ను ప్రారంభించింది. అదే ఇప్పుడు హ్యూమన్‌ వరల్డ్‌ ఫర్‌ యానిమల్స్‌ (హెచ్‌డబ్ల్యుఎ). అనారోగ్యం బారిన పడిన, గాయపడిన జంతువులకు రక్షణ, పునరావాస కేంద్రంగా స్థాపించిన ఈ సంస్థలో నికిత సహా ఐదుగురు సభ్యుల బృందం పనిచేస్తోంది. జంతువులను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలను ప్రోత్సహిస్తూ కారుణ్య సమాజాన్ని సృష్టించడానికి ఈ సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు.

మూగ జీవుల సంరక్షణలో..


జంతువుల జనన నియంత్రణ, వదిలివేయబడిన కుక్కల కోసం యాంటీ రాబిస్‌ టీకా కార్యక్రమంపై ఈ సంస్థ పనిచేస్తోంది. పెంపుడు జంతువుల కోసం సొంత వెటర్నరీ క్లినిక్‌ను ప్రారంభించింది. ఇక్కడ సేవలకు ప్రాథమిక రుసుము ఉంటుంది. ఈ క్లినిక్‌ ద్వారా వచ్చే లాభాలను రక్షించిన జంతువుల చికిత్స కోసం ఉపయోగిస్తారు. పాఠశాలలు, కళాశాలలలో జంతు సంక్షేమం గురించి అవగాహన కార్యక్రమాలను ఈ బృందం నిర్వహిస్తోంది. జంతువులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయపడటానికి స్థానిక సంస్థలకు మార్గదర్శకత్వం ఇస్తుంది. జంతు దుర్వినియోగదారులపై, జంతు సంరక్షణాధికారులను వేధించే వారిపై తనిఖీ చేయడానికి ఇది పోలీసు శాఖతో కలిసి పనిచేస్తుంది. హోస్పేట్‌, రాయచూర్‌, గుంటకల్‌, హుబ్లి-ధార్వాడ్‌, కుర్గోడ్‌, హసన్‌ నుండి ఈ సంస్థకు కేసులు వస్తుంటాయి.


మూడున్నర నెలల కుక్కపిల్ల అనంత్య. ఒకసారి నిద్రిస్తున్నప్పుడు దాని ముఖం మీదనుంచి కారు వెళ్లి తీవ్ర గాయాల పాలైంది. స్థానిక పశువైద్యులు తమ వంతు కృషిచేసి ఇక బతకదని చెప్పారు. కానీ ఆ కుక్కపిల్ల తోక ఊపుతూ వారికి ఆశ కల్పించింది. ఢిల్లీకి చెందిన ఒక యానిమల్‌ వెల్ఫేర్‌ సంస్థ సహకారంతో చికిత్స చేయించారు. చికిత్సతో పాటు, అది తమ బృందంతో పెరగడం వల్లే కుక్క పిల్ల కోలుకుందంటుంది నికిత.


ఈ సంస్థలో ల్యాబ్‌టెక్‌ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు లోకన్న గౌడ. ''నేను ఎప్పుడూ జంతువుల కోసం పనిచేయాలని అనుకోలేదు. నేను హెచ్‌డబ్ల్యుఎతో పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఉద్యోగం వదిలేసి పూర్తి సమయం ఇక్కడే ఉండాలనుకుంటున్నాను'' అని అంటున్నాడు. మరో వాలంటీర్‌ నందీష్‌ అనే విద్యార్థి. తాను నివసించే మురికివాడలాంటి ప్రాంతంలోని ప్రజలకు కనికరం లేదంటాడు. ఒకసారి గాయాలతో ఉన్న ఆవును రక్షించే ప్రయత్నం చేస్తుంటే అతన్ని కొట్టారు. ఈ బృందం మద్దతు లేకపోతే జంతువుల కోసం పని చేయడం నాకు చాలా కష్టంగా ఉండేది అంటున్నాడు.

మూగ జీవుల సంరక్షణలో..


నికితా బృందం పనిచేయడానికి ప్రతి నెలా రూ.2 లక్షల 30 వేల వరకూ ఖర్చవుతుంది. విరాళాల రూపంలో నిధులు సమకూర్చుకుంటున్నారు. కొన్నిసార్లు నిర్వహణ కోసం అప్పు చేయాల్సి వస్తోంది. జంతువులను రెస్క్యూ సెంటర్‌కు తరలించడానికి అంబులెన్స్‌ లేకపోవడం మరో సవాలు. ప్రస్తుతం నికితా బృందం రక్షించబడిన జంతువులను ఉంచడానికి, కార్యకలాపాలను నిర్వహించడానికి ఒక పాతబడిన ప్రభుత్వ భవనాన్ని ఉపయోగిస్తోంది. ప్రభుత్వం ఆ భవనాన్ని మరో అవసరానికి ఉపయోగించుకోవడంతో భూమిని సేకరించి రెస్క్యూ సెంటర్‌ను నిర్మించే పనిలో ఉన్నారు. తప్పిపోయిన అన్ని రకాల జంతువుల కోసం బళ్లారిలో పూర్తిగా ఇంటిగ్రేటెడ్‌ రెస్క్యూ సెంటర్‌ కమ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది నికిత. ''బళ్లారి జిల్లాలో పశువైద్య సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. పెంపుడు జంతువుల యజమానులు అధునాతన చికిత్స కోసం సమీప నగరాలకు ప్రయాణించాల్సి వస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి పశువైద్య ఆసుపత్రి ఆలోచన చాలా సముచితంగా అనిపించింది'' అని నికితా చెప్పారు. 


ఐదుగురు సభ్యులతో కూడిన హెచ్‌డబ్ల్యుఎ సంస్థ ఇప్పటివరకు 6 వేల జంతువులను రక్షించింది. కుక్కలు, పిల్లులు, ఆవులు, పందులు, పక్షులు, కొన్నిసార్లు స్థానిక అటవీ శాఖ సహాయంతో కోతులు, పాములు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులను రక్షించి, వాటి ప్రత్యేక సంరక్షణ కోసం బెంగళూరుకు తరలించారు.