Feb 23,2021 18:52

మనుషులకు ఎవరికైనా ప్రమాదం జరిగిదంటే సాయం చేయడానికి కుటుంబ సభ్యులు, ఆసుపత్రులు, డాక్టర్లు ఉన్నారు. అదే ప్రమాదం మూగ జీవాలకు ఎదురైతే? వాటి పరిస్థితి ఏంటి అనుకున్నాడు మిటల్‌ ఖేతాని. వాటి కోసం ఆసుపత్రిని కట్టించి, వైద్యులను అందుబాటులో ఉంచాడు. 17 సంవత్సరాలుగా జంతు సంరక్షణ కోసం కృషి చేస్తున్నాడు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన మిటల్‌ ఖేతాని చిన్నప్పటి నుంచి సేవా దృక్పథం ఉన్న వ్యక్తి. తను 18 ఏళ్ల వయసులోనే చావు బతుకులో ఉన్న మనిషికి రక్తదానం చేసి అతన్ని కాపాడాడు. ఇతరులకు సహాయం చేయడంలో తనకు ఆనందం కలుగుతుందనకున్నాడు. చదువు పూర్తి అయ్యాక ఓ కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. నెలవారి జీతం అతనికి ఆనందం కలగలేదు. రోడ్ల వెంట తిరుగుతూ ఆహారం దొరక్క చనిపోయిన జంతువుల మృతదేహాలు అతని మనుసును కలిచివేశాయి. దాంతో వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలనుకున్నాడు. వీధుల వెంట తిరుగుతున్న కుక్కలు, కోతులు, పశువులు ఆహారం కోసం ఏది దొరికితే అవి తినడం గమనించాడు. సరైన పోషణ లేక ఏదో ఒక జబ్బుతో బాధపడటం గుర్తించాడు. వాటిని చేరదీసి వైద్యం చేయించాడు. రోజులు గడిచేకొద్ది ఏదో ఒక రోగంతో, గాయాలతో బాధపడుతున్న పశువుల సంఖ్య పెరగడంతో స్నేహితుల సహాయంతో ట్రస్టును ప్రారంభించాడు. మూగజీవాల రక్షణే తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. వాటి బాధను చెప్పలేని జంతువులను, పక్షులను రక్షించడంలో తన ఆనందం వెతుకున్నాడు. పశువుల ఆహారం, మేత కోసం లక్షల్లో ఖర్చు అవుతున్నా వెనకడుగు వేయకుండా దాతలు చేసిన సహాయంతో వాటి కడుపు నింపుతున్నాడు. కొన్ని ఏళ్ల తర్వాత ఎన్జీఓల ద్వారా శ్రీకరుణా ఫౌండేషన్‌ స్థాపించి వాటి బాగోగులు చూస్తున్నాడు. వందల్లో ఎమర్జన్సీ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. జంతుశాలకు దగ్గర్లోనే స్వయంగా వైద్యశాలను స్థాపించారు. ఇందులో వైద్యసిబ్బంది 24 ఞ 7 పనిచేస్తూ వైద్యం అందిస్తారు. ఇప్పటి వరకూ 5 లక్షలకు పైగా జంతువులను, వివిధ రకాల పక్షులను రక్షించారు. మిటల్‌ని చూసి అక్కడి యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జంతు సేవా కార్యక్రమంలో పాల్గొంటుంది. వీరి సేవలను గుర్తించి జంతు సంక్షేమ బోర్డు ఆఫ్‌ ఇండియా 'ప్రాణిమిత్రా అవార్డు'ను ప్రకటించింది. లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన వందలాది కుటుంబాలకు అతడు సహాయం చేశాడు. ప్రస్తుతం 300 మంది ఉన్న వృద్ధాశ్రమంలో ఒక చిన్న గదిలో మిటల్‌ ఖేతాని ఉంటున్నాడు.

birds