Oct 10,2021 12:17

    క్టోబర్‌ నెల నుంచి క్రమంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఎయిమ్స్‌ ఆరోగ్య గణాంక నిపుణులు అంచనా వేశారు. 2022 జనవరి-ఏప్రిల్‌ మధ్య కట్టడి చేయలేనంత తీవ్ర స్థాయికి చేరే అవకాశముందని చెబుతున్నారు. పర్యాటకుల సంఖ్య పెరుగుదల, సభలు, సమావేశాలు మూడో ఉధృతికి దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రాలు ఆంక్షలను పాటించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లోని రోజువారీ కేసులు 103 శాతం వరకూ ఉండొచ్చని ఓ అంచనా. ఆంక్షలు పాటిస్తూ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే తీవ్రత కొంతమేర తగ్గుతుందని చెబుతున్నారు.
    భౌతికదూరం పాటించకపోతే కరోనా వంటి శ్వాసకోశ సంబంధ రోగాలు విస్తృతంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని, హోటళ్లు, కేఫ్‌లలో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం.. షేక్‌హ్యాండ్స్‌ ఇచ్చుకోవడం వంటి పనులతో కరోనా ముప్పు తప్పదంటున్నారు.
దేశానికి మూడో ఉధృతి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారుల, ఆరోగ్య కార్యకర్తలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ సూచించారు. తమ నిపుణులు పేర్కొన్న గణాంకాలు ఇప్పటివరకూ తప్పలేదని హెచ్చరించారు. మరో 6-8 వారాల పాటు బాధ్యతగా ప్రవర్తిస్తే తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందన్నారు.

                                                            పేగుల్లో కరోనా !

కోవిడ్‌ నయమైన అనంతరం బాధితులను రకరకాల వ్యాధులు వేధిస్తున్నాయి. అన్ని అవయవాలపైనా కరోనా ప్రభావం చూపుతోంది. తాజాగా చిన్నపేగుల్లోనూ ఇబ్బందులు సృష్టిస్తోందని తేలింది. ఇటీవల రోజుల వ్యవధిలో ఆరుగురు తీవ్ర కడుపునొప్పితో నిమ్స్‌లో చేరారు. చిన్నపేగుల్లో రక్తం గడ్డకట్టి గ్యాంగ్రేన్‌ (కుళ్లిన స్థితి)గా మారినట్లు వైద్యులు గుర్తించారు. ఇద్దరిలో దీని తీవ్రత అధికంగా ఉండటంతో పేగులను తొలగించారు. వీరిలో కిడ్నీలూ దెబ్బతిన్నాయి. డయాలసిస్‌ ద్వారా చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాధితుల్లో ఇద్దరు మహిళలున్నారని, అయితే వీరికి కోవిడ్‌ సోకినట్లు కూడా తెలీదని, అయితే వీరిలో కోవిడ్‌ యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్‌ అనంతరం వీరిలో ఈ సమస్య వచ్చినట్లు నిర్ధారణైనట్లు నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్‌ ఎన్‌.బీరప్ప తెలిపారు.
 

                                                          అప్రమత్తత అవసరం

పేగుల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితిని అక్యూట్‌ మెసెంటెరిక్‌ ఇస్కీమియా (ఎఎంఐ)గా వ్యవహరిస్తారు. ముందే గుర్తించకపోతే అది గ్యాంగ్రేన్‌గా మారే ప్రమాదం ఉంది. అప్పుడు కుళ్లిన భాగాన్ని మొత్తం తీసేయాల్సి ఉంటుంది. నిమ్స్‌ కాకుండా మరో రెండు, మూడు ఆస్పత్రులకూ ఈ తరహా కేసులొచ్చాయి. కడుపులో తీవ్రమైన నొప్పి, వాంతులు, నల్లరంగులో విరేచనాలు వంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ ఇబ్బంది ఉంటుంది.