Sep 20,2021 07:47

దుంపలపల్లిలో రత్నయ్య, సీతమ్మ దంపతులు ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కుమార్తె భ్రమరాంబ. గ్రామంలోని పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. చదువులోనూ, ఆటపాటల్లోనూ ఎప్పుడూ ముందుండేది. ఆమె తెలివితేటలు చూసి ఉపాధ్యాయులు ముచ్చట పడేవారు. ఒక్కరోజు కూడా స్కూలుకు సెలవు పెట్టకుండా వచ్చే భ్రమరాంబ అకస్మాత్తుగా రావడం మానేసింది. అసలేం జరిగిందని తోటి విద్యార్థులను ఆరా తీసిన ప్రధానోపాధ్యాయులకు విషయం తెలిసింది. భ్రమరాంబకి ఇద్దరు కవల తమ్ముళ్లు పుట్టారని, అమ్మానాన్నలు కూలిపనికి వెళ్తే ఇంటి దగ్గర తమ్ముళ్ల ఆలనాపాలనా చూసుకోవడానికి ఆమెను ఉంచారని తెలిసింది. ఇకపై పాఠశాలకు రాదని, చదువు మాన్పించారని తెలుసుకుని ఉపాధ్యాయులు చాలా బాధపడ్డారు. వారు ఎంత చెప్పినా భ్రమరాంబ తల్లిదండ్రులు ఆమెను స్కూలుకు పంపడానికి ఒప్పుకోలేదు. పాపం చదువంటే ప్రాణం అయినా కుటుంబ పరిస్థితుల కారణంగా మధ్యలో చదువు ఆపేయక తప్పలేదు. కొద్దిరోజుల తర్వాత ఉన్న ఊరిని వదిలి, పట్నంకు వలస వెళ్లింది భ్రమరాంబ కుటుంబం.
పట్నంలో ఉంటున్న భ్రమరాంబ చినిగిన దుస్తులు, చింపిరి జుట్టుతో, బిచ్చమెత్తుకుంటూ ఒకరోజు చంద్రం మాస్టర్‌ కంటపడింది. ఊర్లో ఉన్నప్పుడు ఆమె క్లాస్‌ టీచర్‌ ఆయన. భ్రమరాంబను ఆ అవతారంలో చూసి చాలా బాధపడ్డారు. వెంటనే తనతోపాటు తన ఇంటికి తీసుకెళ్ళి, మంచి బట్టలు ఇచ్చి కడుపునిండా భోజనం పెట్టారు. ఎందుకిలా బిచ్చమెత్తుకుంటున్నావని భ్రమరాంబను అడిగితే, నాన్న అనారోగ్యంతో మంచానపడ్డాడని, అమ్మ ఆరోగ్యమూ అంతంత మాత్రంగానే ఉందని చెప్పి భోరున ఏడ్చింది.
చంద్రం మాస్టారు భ్రమరాంబను ఊరడించి, 'ఇక నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండు' అని చెప్పారు. వాళ్ల పిల్లలు చదువుకునే పాఠశాలలోనే ఆమెనూ చేర్పించారు. అంతేకాకుండా 'మీ అమ్మానాన్నలనూ ఇక్కడికి తీసుకువస్తే పక్కన ఉన్న మా పాత ఇంట్లో ఉంటారు!' అని చెప్పారు. మాస్టారు అలా చెప్పగానే ఒక్కసారి ఎగిరి గంతేసింది భ్రమరాంబ. తనకు మళ్లీ మంచిరోజులు వచ్చినందుకు సంతోషడింది. వెంటనే ఇంటికి వెళ్లి అమ్మానాన్నలకు విషయం చెప్పింది. వారు సంతోషించి, చంద్రం మాస్టారు పాత ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు. మాస్టర్‌ దయార్ద్ర హృదయానికి చేతులెత్తి మొక్కారు.
తక్కువ కాలంలోనే భ్రమరాంబ చంద్రం మాస్టర్‌ గారింట్లో సొంత మనిషిగా కలిసిపోయింది. వారి పిల్లలతో కలిసి చదువుతూ మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకుంది. ఉపాధ్యాయుల మన్ననలను పొందసాగింది. చంద్రం మాస్టర్‌ దయతో డిగ్రీ పూర్తి చేసుకున్న భ్రమరాంబ పోటీ పరీక్షలకు పట్టుదలతో ప్రిపేరై, మండల రెవెన్యూ అధికారిగా ఉద్యోగం సాధించింది. తను ఇంతటి దాన్ని కావడానికి కారకులైన చంద్రం మాస్టార్‌ గారి పాదాలపై పడి 'మీ ప్రోత్సాహమే నన్ను ఇంతటి దాన్ని చేసింది. మీరే కనుక మమ్మల్ని పట్టించుకోకపోతే మా జీవితాలు వేరేగా ఉండేవి' అంటూ కన్నీరుమున్నీరైంది. 'చదవాలనే కోరిక ఉంటే మట్టిలోనూ మాణిక్యాలు తయారవుతాయని నువ్వు నిరూపించావు' అన్నాడు చంద్రం మాస్టర్‌ ఆనందభాష్పాలు రాలుస్తూ.
 

యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌
94417 62105