Nov 30,2020 21:22

మత్స్యకారుల రాక కోసం ఎదురు చూస్తున్న కుటుంబీకులు

పూసపాటిరేగ : విశాఖ నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ఆచూకీ లభ్యం కాలేదు. బోటులో పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన 8మంది మత్స్యకారులు ఉన్నారు. బంగ్లాదేశ్‌ సరిహద్దులో చేపల వేటాడుతుండగా ఆ దేశ కోస్టుగార్డులు పట్టుకున్నట్లు సమాచారం బంధువులకు అందింది. దీంతో తీరంలో మత్స్యకార గ్రామాలన్నీ ఉలిక్కిపడ్డాయి. అయితే సోమవారం మధ్యాహ్నం తామంతా సురక్షితంగా ఉన్నామని బంధువులకు సమాచారం అందింది. దీంతో విషాదఛాయలు అలముకున్న వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
పూసపాటిరేగ, భోగాపురం తీరగ్రామాల్లోని తొమ్మిది మంది మత్స్యకారులు విశాఖ నుండి ఈ నెల 7న వేటకు వెళ్లారు. వేట చేస్తున్న సమయంలో చోడిపల్లి నాగరాజు అనే మత్స్యకారునికి అనారోగ్యంగా ఉండడంతో ఆయన్ను వేరొక బోటులో ఒడిశా తీరానికి చేర్చారు. మిగతా 8మంది వేట పూర్తి చేసుకొని వచ్చేయాల్సిన సమయంలో ఒక్కసారిగా వారి నుంచి సమాచారం ఆగిపోయింది. ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్న సమయంలో వారిని బంగ్లాదేశ్‌ కోస్టుగార్డులు పట్టుకున్నారని సమాచారం తెలిసింది. బంగ్లాదేశ్‌కు చిక్కుకున్న వారిలో పతివాడ, బర్రిపేటకు చెందిన తండ్రీకొడుకులు గరికిని యల్లయ్య (45), శ్రీను (20), మైలపల్లి కొర్లయ్య (32), తిప్పలవలసకు చెందిన నక్కా దానయ్య (32), నక్కా బోడోడు (30), రాయితి లక్ష్ము (29), చింతపల్లికి చెందిన బి.శ్రీను (30), కొండరాజపాలెంకు చెందిన యువకుడు ఉన్నారు. వీరంతా వేటాడుతున్న బోటు అదుపుతప్పి బంగ్లాదేశ్‌ బోర్డర్‌కు వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే వీరిని అదుపులోకి తీసుకున్న కోస్టుగార్డ్సు వీరి వద్ద ఉన్న జిపిఎస్‌, ఇతర పరికరాలు తీసుకొని వదిలేసినట్లు చెబుతున్నారు. దీంతో వీరంతా మళ్లీ సముద్రం గుండా విశాఖకు బయలుదేరినట్లు బంధువులు చెబుతున్నారు. బందీలుగా చిక్కుకున్నారని రోధిస్తున్న బాధిత కుటుంబాలు వచ్చేస్తున్నారని తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కారణంగానే పట్టుబడిన వారిపై దాడి చేసి వదిలేసినట్లు చెబుతున్నారు. దీంతో తీరంలో మత్స్యకార గ్రామాలన్నీ ఊపిరిపీల్చుకున్నాయి.