Sep 24,2021 01:42

షూటింగ్‌ ప్రాంతంలో గుమిగూడిన జనం

ముంచంగిపుట్టు : మండలంలోగల సుజనకోట, పనసపుట్టు పంచాయతీల్లో సరిహద్దు గ్రామమైన గిద్దులపుట్టు మత్స్యగెడ్డ ఒడ్డున గురువారం హనుమెన్‌ సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది. ప్రేమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై జాంబిరెడ్డి, కల్కి, అ సినిమాలు తీసిన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాంబిరెడ్డి హీరో తేజ్‌ సజ్జా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫేమ్‌ హీరోయిన్‌ అమృత అయ్యర్‌ హీరో హీరోయిన్లుగా, జబర్దస్త్‌ కమెడియన్లు గెటప్‌ శ్రీను, రోహిణి ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్నారు. ముఖ్యమైన సన్నివేశాలు, పాటలను గెడ్డ ఒడ్డున చిత్రీకరించారు. షూటింగ్‌ జరుగుతుందన్న విషయం తెలిసి మండలంలోని పలు గ్రామాల నుంచి గిరిజనులు తరలొచ్చారు. దీంతో గిద్దులపుట్టు మత్స్యగెడ్డ ప్రాంతం జనసందడిగా మారింది. రెండు రోజులు పాటు మత్స్యగెడ్డ పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ నిర్వహిస్తామని డెరెక్టర్‌ ప్రశాంత్‌ తెలిపారు.