Nov 23,2020 20:47

బాబాలు, స్వాములు చేసే మోసాలను బట్టబయలు చేసిన సినీ వ్యంగ్యాస్త్రం 'అమ్మోరు తల్లి'. వెల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మాతలు, దర్శకుడు చేసిన ప్రయత్నం అభినందనీయం. దేవుని పేరుతో చలామణి అవుతున్న దళారీల, స్వార్థపరుల గుట్టును చీల్చిచెండాడిన సినిమా ఇది.
హీరో రామస్వామి పెళ్ళిచూపులతో సినిమా ప్రారంభమవుతుంది. హీరో తండ్రి 11 ఏళ్ల క్రితం భార్య, నలుగురు పిల్లలను వదలి వెళ్ళిపోతాడు. హీరో ఓ టీవీ ఛానెల్‌కు వార్తలు అందిస్తూ, కుటుంబ భారం మోస్తుంటాడు. ఇంత కుటుంబ భారాన్ని మోస్తున్న హీరోను పెళ్ళి చేసుకోవటానికి ఏ ఆడపిల్లా అంగీకరించదు. ఒక సందర్భంలో ఆ కుటుంబం తమ కులదైవం కాశీబుగ్గ ముక్కుపుడక అమ్మవారిని దర్శించుకోవటానికి వెళుతుంది. ఆదరణ లేని ఆ ఆలయాన్ని, అమ్మవారి విగ్రహాన్ని శుభ్రపరిచి, ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. అర్ధరాత్రి వేళ దేవత ప్రత్యక్షమై హీరోతో మాట్లాడుతుంది. తన దేవాలయాన్ని తిరుపతిని మించినదిగా చేయాలని కోరుతుంది. ''నువ్వు దేవతవు, నువ్వే ప్రజలను రప్పించుకోవచ్చు కదా'' అనడిగితే దేవతలుగా తాము తమకేమీ చేసుకోలేమని చెబుతుంది. ఖర్చుల కోసం తన నగలను ఇస్తుంది. అమ్మవారి గురించి హీరో గొప్పగా ప్రచారం చేసినా ప్రజలెవరూ పట్టించుకోరు. ఏదైనా అద్భుత కార్యం జరిగితే తప్ప ప్రజలు దేవాలయాలకు రారని అమ్మవారు చెప్పటంతో- హీరో పుట్టలో రహస్యంగా మోటారు బిగించి, పాలు బయటికి వచ్చేలా చేస్తాడు. దాన్నొక మహత్తుగా భావించి, జనం వెల్లువలా వస్తారు. అమ్మవారి పేరుతో రకరకాల వ్యాపారాలు ప్రారంభమౌతాయి.
అదే సమయంలో భగవతి బాబా తన అనుచరగణంతో వచ్చి దేవాలయాన్ని తన అదుపులోకి తీసుకుంటాడు. భక్తిపేరుతో అక్రమాలకు పాల్పడుతుంటాడు. ప్రశ్నించిన వారి వెనుక ఇతర మతాలు, దేశాలూ ఉన్నాయని ప్రచారం చేస్తుంటాడు. ఆకులపల్లి అటవీప్రాంతం లోని 11 వేల ఎకరాల భూమిని కాజేయటం అతడి పన్నాగం. బాబా రాజకీయ నాయకులతో మాట్లాడుతూ... మతం పేరుతో అన్ని రాష్ట్రాల్లోనూ ఓట్లు వేయించుకుంటున్నామని, తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్న ఐదేళ్లలో అలాంటి పరిస్థితి తీసుకురావాలని ఉద్బోధిస్తాడు. హీరో అతడి అక్రమాలను బయటపెట్టటానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు.
ఒక టివి లైవ్‌ కార్యక్రమంలో హీరో ప్రజల నుంచి వచ్చిన రెండు ప్రశ్నలకు బాబా చెప్పిన దానికి భిన్నమైన పరిష్కారాలను చెప్పి, జనామోదం పొందుతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన బాబా తన అనుచరుల మధ్య మీడియా ముందు మూడు ప్రశ్నలు వేస్తానని, వాటికి హీరో కుటుంబం సమాధానాలు చెప్పాలని సవాలు విసురుతాడు. ఆ సమావేశం సమయానికి హీరో కుటుంబాన్ని అంతం చేసేలా ప్రణాళిక రూపొందిస్తాడు. అమ్మవారి రక్షణతో ఆ కుటుంబం ప్రాణాపాయం నుంచి బయటపడి, మీడియా కార్యక్రమానికి హాజరవుతుంది. అపుడు బాబా హీరో కుటుంబాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే అమ్మవారు వచ్చి బాబా అక్రమాలను బయటపెడుతుంది. అనేకమంది బాబాలు వ్యాపారాలు చేస్తున్నారని, భక్తులను రకరకాలుగా మోసం చేస్తున్నారని, దేవుడు ఎక్కడో ఉండడని, ప్రతి ఒక్కరిలో ఉంటాడని చెబుతోంది. ఆఖర్లో దేవత హీరోకి ఎదురై ఏం కావాలో కోరుకోమంటుంది. ''నాకేమీ వద్దు. నాకున్నది చాలు'' అని హీరో అనటంతో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమాలో అమ్మవారు, ఆమె మహిమలు ఉన్నట్టు చూపించినా, మనిషే కీలకమనే విషయాన్ని అన్ని సందర్భాల్లోనూ ప్రతీకాత్మకంగా చూపించారు. వ్యంగ్య ధోరణిలో సినిమాను నడపటం ద్వారా మూఢత్వాన్ని ఎండగట్టారు. మతం పేరిట జరుగుతున్న అనేక వర్తమాన రాజకీయాలను పరోక్షంగా ప్రస్తావించారు. దేశంలో మతోన్మాద రాజకీయాలు ఉధృతంగా సాగుతున్న తరుణంలో ఈ సినిమాను నిర్మించిన నిర్మాత డాక్టర్‌ ఐసరి గణేశ్‌, దర్శకులు ఆర్‌ జె బాలాజి, శరవణన్‌ అభినందనీయులు. ఈ సినిమాలోని నటులంతా పాత్రోచితంగా నటించి, ఆకట్టుకున్నారు. అమేజాన్‌ ప్రైమ్‌ ఓటిటి వేదికగా ఈ సినిమా విడుదలైంది. - ఎకెఆర్‌