Nov 23,2020 07:06

తెలుగునాట అభ్యుదయ సాహిత్యోద్యమం తొలిదశలో ఉన్నప్పుడే బొల్లిముంత శివరామకృష్ణ (1920-2005) సాహిత్య సృజన ప్రారంభించారు. బాల్యంలో ఈయనపై జస్టిస్‌ పార్టీ ప్రభావం, త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం ఎక్కువగా ఉండేది. అందుకు కారణం, వారి తండ్రి గారికి రామస్వామి చౌదరి నడిపే బ్రాహ్మణ వ్యతిరేకోద్యమంతోనూ, జస్టిస్‌ పార్టీతోనూ సన్నిహిత సంబంధాలుండేవి. ఆ ప్రభావం కొడుకు శివరామకృష్ణపై బాగా పడింది. త్రిపురనేని రామస్వామి చౌదరి పద్యకవిత్వం రాస్తూ ఉండేవారు. అయితే పత్రికలకు పంపేవారు కాదు. బొల్లిముంత, గోపీచంద్‌, పి.వి.సుబ్బారావు లాంటి కుర్రాళ్లంతా ఆయనకు శిష్యులైపోయి ఆయనలాగా పద్య కవిత్వం రాయాలని ఉబలాటపడేవాళ్లు. వీళ్ల కవిత్వాన్ని ఆయన సరిచేసి సూచనలిస్తూ ఉండేవారు. ఈలోగా గోపీచంద్‌ తన తండ్రి గారి పద్య కవిత్వాన్ని పక్కన పెట్టి వచనంలోకి మారారు. కథలు రాసిన పత్రికల్లో అచ్చేస్తూ ఉండేవారు. మంచి పేరు వస్తూ ఉండేది. అది చూసి శివరామకృష్ణ కూడా వచనంలోకి మారారు. తనూ కథలు రాసి పత్రికలకు పంపాలని నిశ్చయించుకున్నారు. ఫలితంగా 1936లో మద్రాసు నుంచి వెలువడే 'చిత్రాంగి' పత్రికలో తన తొలి కథ 'ఏటొద్దు' ప్రచురించారు. అప్పుడాయన వయసు పదహారేళ్లు!
ఉద్యమాలతో మమేకం
కథలు రాసి ప్రచురించడం ప్రారంభించిన తర్వాత కొన్నేళ్ల వరకు ఆయనకు అభ్యుదయ రచయితల సంఘంతో సంబంధాలు ఏర్పడలేదు. 1938-39లో గుంటూరులో హయ్యర్‌ గ్రేడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ విద్యార్థి ఉద్యమంతో, ఆ తర్వాత చదలవాడలో ఉద్యోగంలో చేరినప్పుడు కమ్యూనిస్టు ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. ఆ రోజుల్లోనే ఆయన 'దేశం ఏమయ్యేట్టు?', 'వ్యక్తి స్వాతంత్య్రం' వంటి కథలు రాసి ప్రచురించారు. కమ్యూనిస్టు కార్యకర్తగా ఆయన తన అనుభవంలోకి వచ్చిన విషయాల్ని కథలుగా మలచడం తప్ప, పనికట్టుకుని కథలు రాయాలని రాయలేదు. వ్యవసాయ కూలీలు, ఇతర నిరుపేదలపై దృష్టి సారించి, కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రతిబింబిస్తూ రాసేవారు. ఆ రోజుల్లో చదలవాడ పిచ్చయ్య చౌదరి అభ్యుదయ రచయితల సంఘం (అరసం) నాయకుడు. ఆయన ఇటు త్రిపురనేని రామస్వామి చౌదరి, అటు కృష్ణశాస్త్రి లాంటి వారందర్ని కలుపుకుని అభ్యుదయ సాహిత్యోద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండేవారు. 1943లో తెనాలిలో అరసం తొలి మహాసభ జరపడంలో పిచ్చయ్య చౌదరి కృషి ఎంతో ఉంది. ఆ సభకు అధ్యక్షులు తాపీ ధర్మారావు. బొల్లిముంత శివరామకృష్ణ అప్పటికి ఇరవై మూడేళ్ల యువకుడు. ఆ మహాసభకు కార్యకర్తగా పనిచేశారు.
మృత్యుంజయుడు నవల
అవి కమ్యూనిస్టు ఉద్యమం ఉధృతమైన రోజులు. బొల్లిముంత 1945లో టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి సమయం పార్టీకి అంకితం చేశారు. పార్టీ పనుల మీద తిరుగుతూ, మునగాల పరిగణాలోని జగ్గయ్యపేటకు వెళ్లిరావడం జరగుతూ ఉండేది. అక్కడే తెలంగాణా పోరాటం గురించి వినడం, అందిన రిపోర్టులు చదువుకోవడం, విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉండేది. వాటితో ఉత్తేజితుడైన బొల్లిముంత ఇరవై ఏడేళ్ల వయసులో 'మృత్యుంజయులు' నవల రాశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన 1946-51 మధ్య అర్ధ దశాబ్ద కాలం పాటు తెలంగాణ రైతులు సాయుధలై దోపిడి వర్గాలపై తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో కవులు, రచయితలు, కళాకారులు, ఎంతోమంది భాగ స్వాములయ్యారు. యాదగిరి, సుద్దాల, తిరునగిరి, నాజర్‌, సుంకర, వాసిరెడ్డి, కాళోజి, దాశరథి, కుందుర్తి, సోమసుందర్‌, గంగినేని వంటి కవులు తమ ఆక్షరాయుధాలతో ముందు నిలిచారు. తెలంగాణ పోరాటం ప్రారంభమైన ఒక సంవత్సరానికి బొల్లిముంత 'మృత్యుంజయులు' నవల 1947 అక్టోబర్‌ 25న విడుదల చేశారు. ఒక రకంగా కవులకంటే కూడా తన నవలాయుధంతో ఆయన ముందు నిలిచారు. ఆ తర్వాత గంగినేని 'ఎర్రజెండాలు', వట్టి కోట 'ప్రజల మనిషి', 'గంగు'; 'మహీధర రామ్మోహనరావు' 'ఓనమాలు', 'మృత్యునీడల్లో', 'తిరునగిరి' 'సంగం' వంటి నవలలు వెలువడ్డాయి. అయితే అవన్నీ పోరాటం విరమించిన తర్వాత వెలువడ్డాయి. పోరాట విరమణకు ముందు, బొల్లిముంత నవల తర్వాత వెలువడింది లక్ష్మీకాంత మోహన్‌ 'సింహగర్జన'.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో రైతులు పంటలు పండించుకున్నందుకు శిస్తులు కడతారు. కాని, నాటి తెలంగాణాలో శిస్తులు కట్టడానికి మాత్రమే పంటలు పండించాల్సి వచ్చేది. ఆ దుర్భర స్థితిని సహజంగా చిత్రించింది 'మృత్యుంజయులు' నవల. చచ్చేవాడికి రెండు చావులు ఉండవని, దినదిన గండంగా ప్రతిరోజూ చస్తూ బతకడం కన్నా భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాటంలో చావడమే మేలని జెండా పట్టి పోరాటంలో నేలకొరిగిన వీరులే ఈ మృత్యుంజయులు. నవలలోని ముఖ్యపాత్రలన్నీ పోరాటంలో మరణిస్తాయి. అంటే, వీరమరణం పొందుతాయి. నవలా రచయిత దృష్టిలో వారంతా చావును జయించిన వారు, మృత్యుంజయులు అని అర్థం! తెలంగాణా పోరాటకాలంలో వెలువడిన తొలి నవలగా, ఒక చారిత్రక అవసరాన్ని గుర్తించి, ప్రజాపోరాటాన్ని నమోదు చేసిన నవలగా తెలుగు సాహిత్యంలో మృత్యుంజయులుకు సుస్థిర స్థానం ఉంటుంది. నాటి కమ్యూనిస్టు నాయకులు చంద్రం ఈ నవలను బొల్లిముంతతో ఆరుసార్లు తిరగరాయించారట! రావి నారాయణరెడ్డి ఈ నవలకు ముందుమాట రాశారు.
సినీ రచయితగా ...
కమ్యూనిస్టు పార్టీ చీలిపోకముందే 1964లో ఆత్రేయ ప్రోత్సాహంతో బొల్లిముంత శివరామకృష్ణ ఆయనకు సహాయకుడిగా మద్రాసు వెళ్లారు. మొదట్లో తమిళ సినిమాలకు అనువాదాలు చేస్తుండేవారు. ఆత్రేయ స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన, 'వాగ్దానం'కు బొల్లిముంత తొలిసారి స్వయంగా మాటలు రాశారు. 'తిరుపతమ్మ కథ'కు సంభాషణలు రాసేసరికి ఆ కళలో మరింత పట్టు సాధించారు. ఆ రకంగా 'మనుషులు మారాలి' చిత్రం సంభాషణలతో పెద్ద హిట్టయ్యింది. దాంతో, బొల్లిముంత మద్రాసులో స్థిరపడాల్సివచ్చింది. సుమారు 45 సినిమాలకు సంభాషణలు రాశారు. మధ్యలో కొన్ని పాటలు కూడా రాశారు. 'కాలం మారింది'కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు, 'నిమజ్జనం'కు జాతీయ అవార్డు లభించాయి.
''రచనలు అభూత కల్పనల వైపుకాక, జీవిత వాస్తవాల వైపు సాగాలి. సమస్యలు చర్చించాలి. పరిష్కారాలను సూచించాలి. యువ రచయితలకి సరైన మార్గం నిర్దేశించాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది.'' అని తరచూ చెబుతూ ఉండేవారు బొల్లిముంత శివరామకృష్ణ. వారితో నా పరిచయం చాలా సాదాసీదాగా జరిగింది. అది 1993-97 మధ్య కాలం. ఓ రోజు ఓ కుర్రాడొచ్చి ''మా పెద్దనాన్న వస్తానన్నారు. ఇంట్లో ఉంటున్నారా?'' అని అడిగాడు. ఎవరో సాహిత్యాభిమాని అయిఉంటాడనుకుని 'సరే తీసుకురా... ఉంటా'నన్నాను. తీరా చూస్తే ఆయన సాహితీ దిగ్గజం బొల్లిముంత శివరామృష్ణ! అప్పటికే 70 ఏళ్ల పెద్దాయన. అభ్యుదయ నవలా రచయితగా, 'మనుషులు మారాలి' చిత్ర రచయితగా పెద్దపేరు సంపాదించుకున్నారాయన. అయనకు నాపై ఏర్పడిన వాత్సల్యపూరిత అభిమానానికి కృతజ్ఞతలతో వినమ్రంగా నమస్కరించి కూర్చోబెట్టాను. తీసుకొచ్చిన కుర్రాడి ఇంటిపేరు కూడా బొల్లిముంత అన్న విషయం మరిచిపోయాను. ఎందుకంటే, అతన్ని మా ఇంట్లో రమణ అని పిలుస్తుండేవాళ్లం. అతనే కవి బొల్లిముంత వెంకట రమణారావుగా రూపుదిద్దుకున్నాడు. అది ఆ తర్వాతి విషయం, శివరామకృష్ణ వాళ్లబ్బాయి హైద్రాబాదు విశాలాంధ్ర ప్రచురణాలయంలో పనిచేస్తుండే వాడు. అందువల్ల ఆయన తెనాలి నుంచి ఎప్పుడు కొడుకు దగ్గరకు హైద్రాబాదొచ్చినా మా ఇంటికి వస్తుండేవాడు. నేను దగ్గరలో ఉన్న దండమూడి మహీధర్‌, సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రేరియన్‌ రాజు, రేడియో చిరంజీవి మొదలైన వాళ్లకు కబురు పెడుతుండేవాడిని. ఓ సారి మా ఇంట్లో, మరోసారి సుందరయ్య పార్కులో కూర్చుని సాహిత్యం గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఒక్కోసారి ఆయనకు ఓపిక ఉందంటే చిక్కడపల్లి నుంచి అలా హిమాయత్‌ నగర్‌ దాకా వెళ్తుండేవాళ్లం. డా|| ఏటుకూరి ప్రసాదో, బూదరాజు రాధాకృష్ణో ఎవరో ఒకరు కలుస్తుండే వాళ్లు. మళ్లా ముచ్చట్లు.. గజ్జెల మల్లారెడ్డి కొంతకాలం చిక్కడపల్లిలో ఉన్నారు. అప్పుడు అదో మీటింగ్‌ ప్లేస్‌! తండ్రి వయసున్న పెద్దవాళ్లతో ఈయనకు ఈ స్నేహాలేమిటని నన్ను చూసి కొందరు ఆశ్చర్యపోతుండేవాళ్లు.సంపాదకత్వం
ఆ రోజుల్లోనే బొల్లిముంత 'ప్రజాపక్షం' అనే మాసపత్రికకు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. తెలుగు అకాడెమీ పక్కన డా|| మిత్ర ఉండే వీధిలో పత్రిక ఆఫీసు కూడా ఏర్పాటు చేశారు. పత్రిక ప్రారంభోత్సవం త్యాగరాయ గానసభ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ప్రారంభ సంచికలో తెలంగాణ ప్రజల భాషలో నేను ఒక కవిత రాశాను. అయితే పత్రిక కొన్ని నెలలు మాత్రమే నడిచింది. ఆ తరువాత ఆయన మళ్లీ తెనాలి వెళ్లిపోయారు. మేం మళ్లీ కలుసుకునే అవకాశం రాలేదు. ఆయన 7 జూన్‌ 2005న మరణించారని తెలుసుకుని బాధపడ్డాం. ఆ మరుసటి నెల జులై 2005 సంచికను 'ప్రజాసాహితి' బొల్లిముంత శివరామకృష్ణ సంస్మరణలో వెలువరించింది. ఉపాధ్యాయుడిగా, ఉద్యమకారుడిగా, అరసం నేతగా, కమ్యూనిస్టు కార్యకర్తగా, నవలా రచయితగా, సినీ రచయితగా, సంపాదకుడిగా బహుముఖ ప్రతిభను కనబరిచిన బొల్లిముంత శివరామకృష్ణ సాహిత్య ప్రపంచంలో మృత్యుంజయుడిగా నిలిచారు.
                                            (నవంబరు 27 : బొల్లిముంత శివరామకృష్ణ జయంతి)
                                            - డాక్టర్‌ దేవరాజు మహారాజు