Oct 28,2021 21:07

ప్రజాశక్తి - వీరవాసరం
సీజనల్‌ వ్యాధులు విజృంభించకుండా ఆరోగ్య, పంచాయతీ రాజ్‌ శాఖాధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల శాఖ అధికారులను హెచ్చరించినా పట్టించుకోలేదు. ఫలితంగా మండలంలో పెర్కిపాలెం గ్రామానికి చెందిన కందుకూరి స్వామికి విషజ్వరం సోకి అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, వైద్యాధికారులే బాధ్యత వహించాలని, గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం వీరవాసరం పిహెచ్‌సి వద్ద, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. కొన్ని సంవత్సరాలుగా పెర్కిపాలెంలో అపారిశుధ్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సిపిఎం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. దీంతో గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయని తెలిపారు. గ్రామంలో పరిశుభ్రమైన తాగునీరు లేక, దోమలు విజృంభణతో గ్రామస్తులు జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ పాలకవర్గాలు ఏర్పడినా మండలంలో వారి పని తీరు అంతంత మాత్రంగానే ఉందని సిపిఎం నాయకులు జుత్తిగ నరసింహమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. పెర్కిపాలెంలో నెలకొన్న పరిస్థితులను జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.