Dec 03,2021 21:32

- పెన్నా పొర్లు కట్టలకు రూ.100 కోట్లు
- సోమశిలకు రూ.120 కోట్లు మంజూరు
- నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సిఎం పర్యటన

ప్రజాశక్తి-యంత్రాంగం :పెన్నానది పరివాహక ప్రాంతాలు వరదల్లో దెబ్బతిన్నడానికి కట్టలు బలహీనంగా ఉండడమేనని, మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా చూస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వరద బాధిత ప్రాంతాలైన నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. నెల్లూరు జిల్లాలోని దేవరపాళెం, పెనుబల్లి, భగత్‌సింగ్‌ కాలనీల్లో పర్యటించి దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను పరిశీలించారు. ముంపు బాధితులకు అందిన సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. వరద నష్టాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు సిఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పెన్నా నది పొర్లు కట్టల పటిష్ట నిర్మాణానికి రూ.100 కోట్లు, సోమశిల జలాశయం ఆఫ్రాన్‌ మరమ్మతు పనులకు రూ.120 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. భగత్‌సింగ్‌ కాలనీలోని 99 శాతం మంది వరద బాధితులకు రూ.2 వేల ప్రభుత్వ సాయం, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను జిల్లా యంత్రాంగం సజావుగా అందజేసిందని పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా సాయం అందని వారు ఉంటే సమీపంలోని సచివాలయంలో ఈ నెల 5లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంక్రాంతి పండుగ తర్వాత తానే స్వయంగా సంగం, పెన్నా బ్యారేజీల నిర్మాణాలను ప్రారంభిస్తానని, ఆ సమయంలోనే పెన్నా పొర్లుకట్టల నిర్మాణానికి, సోమశిల ఆఫ్రాన్‌ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేస్తానని సిఎం వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికైనా అందకుంటే డిసెంబర్‌, జూన్‌ నెలలో దరఖాస్తు చేసుకుంటే అన్ని విధాలా విచారించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బిఎంఆర్‌ ట్రస్ట్‌ వరద సహాయం కోసం రూ.1.5 కోట్లను సిఎం జగన్‌కు అందజేశారు.
అంతకు ముందు తిరుపతిలోని తిరుచానూరు పాడిపేట బ్రిడ్జిని పరిశీలించారు. నవంబర్‌ 18న స్వర్ణముఖి నది పొంగి ప్రవహించడంతో పాడిపేట వద్ద వరదలో కొట్టుకుపోయే ప్రజలను కాపాడిన 30 మందిని సిఎం శాలువా కప్పి అభినందించారు. తిరుపతి శ్రీకృష్ణనగర్‌లో పర్యటిస్తున్న సిఎంకు శెట్టిపల్లి నాయకులు కలిసి వినతిపత్రం అందించారు. 36 మండలాల్లో ఏనుగుల సంచారం అధికంగా ఉందని, విద్యుత్‌ కంచె ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ బడ్జెట్‌ నుంచి రూ.28.15 కోట్ల నిధులు మంజూరు చేయాలని జెడిపి చైర్మన్‌ శ్రీనివాసులు సిఎంకు వినతిపత్రం అందజేశారు. ముంపునకు గురైన ప్రాంతాలకు సంబంధించి నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు.