Jan 15,2022 07:59

ఉనికి ప్రశ్నార్ధకమై
కడుపులోకి గుండె జారి
కొట్టుకుంటుంటే
నిన్నెలా ఆహ్వానించేది?
నీకెలా స్వాగతం పలికేది??
పల్లె పండుగని
అహో పంచభక్ష్య
పరమాన్నాలుంటాయని
పరుగులెత్తుకు
వస్తున్నావేమో.....
రంగవల్లులతో నీకోసం ఎదురు
చూస్తున్నామని
అనుకుంటున్నావేమో....
చినుకు రాక కునుకే లేని మోడు
ముంగిళ్ళలో
పాయసాన్నాలు పాలపొంగులూ
ఎక్కడుంటాయి?
ఏ దేవుళ్ళ శాపానికో
ఏ రక్కసి భీకర కోపానికో
కసువు లేక పశువులన్నీ ఎండిన
డొక్కలతో కబేళాలకు చేరితే
మా ఇళ్ల ముందు గొబ్బిళ్ళ శోభ
ఎలా వుంటుంది?
మా నట్టింటి గద్దె మీద
కూర్చుందామని కలలు కంటూ
వస్తున్నావేమో!
పంటలసాగు తెచ్చుకున్న
అప్పులు ఇంతింతలై పెరిగి
నడ్డి విరుస్తుంటే
అవమానాలు మోయలేక వీధుల్లో
అడుగు వేయలేక
చెట్లకి ఆత్మహత్యలుగా
వేలాడుతుంటే
నిన్నెలా ఆలింగనం చేసుకోవాలి
సంక్రాంతీ?
ధాన్యంతో కడుపు
నింపుకోవాల్సిన
మా గాదెలన్నీ
శూన్యపు చూపులతో
ఆకలి కేకలు పెట్టి అల్లాడుతుంటే
నువ్వు 'సిరిమాలచ్చిగా'
ఎలా రాగలవు?
గంగిరెద్దులు, గాలిపటాలు
లేవిక్కడ
నోట మెతుకులు లేని
మనుషులున్నప్పుడు
నీకెలా ఆతిథ్యం ఇస్తాం?
నిన్నెలా ఆహ్వానించగలం?
మరలిపో ఇప్పటికి!
మా నాగళ్లు కన్నెర్ర చేసి
మా భూములు సర్రున లేచి
మా చెట్లు ఉద్రేకంతో కొమ్మల
పడగలెత్తి
మాకు జ్ఞానబోధ చేస్తున్నాయి
బతుకు మీది కలుపు మొక్కలు
ఏరి పారేయమని
మా భూములు తడిసి మా
పొలాలు విరగబడినప్పుడు
మా పశువులు ఆకలి తీరిన
పొట్టలతో
నెమరేసుకుంటున్నప్పుడు
మా గాదెలు భుక్తాయాసంతో
మురిసినప్పుడు
నువ్వు తప్పకరా మకర
సంక్రాంతి!
 

- రజిత కొండసాని