Dec 03,2021 19:33

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటనకు ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. కథలోని పాత్రకి ఆయన అభినయంతో పూర్తిగా న్యాయం చేస్తాడు. ఇండిస్టీలో వచ్చిన మార్పులకనుగుణంగా.. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్‌ చేసి.. టాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం మరక్కార్‌. తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి స్థాయిలో ఈ చిత్రముంటుందని ప్రచారం జరిగింది. మరి ఈ సినిమా బాహుబలి రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? లేదో తెలుసుకుందామా..!


కథ
16వ శతాబ్దానికి చెందిన ఒక కేరళ పోరాట యోధుడి కథ ఇది. సముద్ర యుద్ధ వ్యూహాల్లో ఆరితేరిన కుంజాలి మరక్కర్‌ (మోహన్‌లాల్‌) కేరళ తీర ప్రాంతాన్ని పోర్చుగీసువారు ఆక్రమించుకోకుండా తన ధైర్య సాహసాలతో అడ్డుకుంటాడు. అలా అడ్డుకున్న ఫలితంగా పోర్చుగీసు సైన్యం మరక్కర్‌ కళ్లముందే తన కుటుంబ సభ్యుల్ని హతమారుస్తుంది. దీంతో మరక్కార్‌ పోర్చుగీసువారిపై పగ తీర్చుకోవడానికి రహస్య జీవితంలోకి వెళతాడు. ఈ సమయంలోనే పోర్చుగీసు సైన్యం కొచ్చిన్‌ను ఆక్రమించుకోవడానికి ప్రణాళికలు రచిస్తుంది. మరి రహస్య జీవితాన్ని గడుపుతున్న మరక్కార్‌ తిరిగి తన బలాన్ని ఎలా కూడగట్టుకుని.. పోర్చుగీసువారిపై పగ తీర్చుకుంటాడు? అనేదే కథ.

1123


విశ్లేషణ
ఈ చిత్ర పోస్టర్‌లు.. నటీనటులను చూస్తే.. కచ్చితంగా బాహుబలి రేంజ్‌లోనే ఉంటుందనే ఊహాగానాలు మొదటి నుంచీ ఊపందుకున్నాయి. అయితే సినిమా బాహుబలి స్థాయిలో లేదనే ప్రేక్షకులు ఫీలవుతారు. కేవలం సాంకేతికపరంగా సినిమాను ఆ స్థాయిలో అనుకున్నా.. వీరోచిత పోరాటాల్లో బాహుబలి స్థాయి లేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాలో.. టెక్నాలజీ పరంగా హైలెవల్‌లోఉన్నా.. యుద్ధాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. అందుకే బాహుబలి సూపర్‌డూపర్‌ హిట్టయింది. మరక్కార్‌ చిత్రంలో ఇదే ప్రధాన లోపంగా తెలుస్తోంది. అయితే ఒకటి రెండు పోరాట ఘట్టాలే చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. అలాగే సినిమా ప్రారంభం నుంచే కొత్త పాత్రలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అయితే పాత పాత్రల ప్రభావం ఏంటీ? ఎలా ఉండబోతుంది అనేది కథనం ఆసక్తిగా సాగలేదు. పాత్రల మధ్య సంఘర్షణ గందరగోళంగా ఉంది. వెరసి డైరక్టర్‌ సాంకేతికత మీద పెట్టిన దృష్టి కథనాన్ని నడిపించడంలోనూ.. పాత్రల ప్రభావంపైనా పెట్టలేదనిపిస్తోంది. వాటిపై ఇంకొంచెం కసరత్తు చేసి ఉంటే.. సినిమా మరో లెవెల్లో ఉండేదనిపిస్తోంది.

172

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో మరక్కార్‌ పాత్రలో పోరాట యోధునిగా మోహన్‌లాల్‌ అద్భుతమైన నటనను కనబరిచారు. ఆయన నటనానుభవంతో మరక్కార్‌ పాత్రలో ఒదిగిపోయారు. అయితే 'మన్యం పులి' చిత్రంలో ఉన్నంత హుషారుగా ఈ చిత్రంలో లేరనిపిస్తోంది. జూనియర్‌ మరక్కార్‌, అతని ప్రేయసి పాత్రల్లో మోహన్‌లాల్‌ తనయుడు ప్రణవ్‌, దర్శకుడు ప్రియదర్శన్‌ కూతురు కల్యాణి ప్రియదర్శన్‌ కలిసి చేసిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కీర్తిసురేష్‌, మంజువారియర్‌ కలిసి చిన్న పాత్రల్లో మెరిశారు. ఇక సుహాసిని, అర్జున్‌, , నెడుముడి వేణు, ప్రభు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. తిరు కెమెరా పనితనం బాగుంది. సంగీతం పరవాలేదు. నిర్మాణ విలువలు చెప్పుకోదగస్థాయిలో ఉన్నాయి. దర్శకుడు ప్రియదర్శన్‌ కథనం పరంగా దృష్టి పెట్టుంటే బాగుండేది.

127