Nov 01,2020 11:05

పాట్నా : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గంటున్న ప్రధాని మోడీకి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ 11 ప్రశ్నలను సంధించారు. మూడు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా మోడీ నాలుగు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నిరుద్యోగం, వలస, బీహార్‌కు ప్రత్యేక హోదాతో పాటు పలు సమస్యలను ప్రశ్నల ద్వారా లేవనెత్తారు. రాష్ట్రంలో విద్య, ఆరోగ్య ప్రమాణాలలో రాష్ట్రం చాలా వెనుకబడి ఉందని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. మోడీ ఎన్నికల ర్యాలీలో పాల్గనే గంట ముందు సోషల్‌ మీడియా వేదికగా ఈ ప్రశ్నలు సంధించారు. నీటి కుళాయి పథకంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం (బిజెపి-జెడియు ప్రభుత్వాన్ని ఉద్దేశించి) ఎందుకంటూ ప్రశ్నించారు. కేవలం నీటి సరఫరా, శానిటైజేషన్‌కు మొత్తం బడ్జెట్‌లో 4 శాతమే ఖర్చు చేస్తున్నారంటూ విమర్శించారు. దేశంలోనే అతి పేద రాష్ట్రమైన బీహార్‌లో పోషక లోపం, ఆకలి వంటి సమస్యలపై బడ్జెట్‌ కేటాయింపుల్లో 2 శాతం మాత్రమే ఎందుకు ఖర్చు పెడుతున్నారో ప్రధాని మోడీ చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. 15 సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని ఏలుతున్నప్పుడు ఆకలి, పోషకాహార లోపం ఎందుకు అధిగమించలేకపోయారో తెలుపుతారా అంటూ మరో ప్రశ్న సంధించారు. నిరుద్యోగానికి కేంద్రం బిందువుగా బీహార్‌ మారిందని, రాష్ట్రంలో ఈ డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వంలో నిరుద్యోగిత రేటు 46.6 శాతంగా ఉందని తేజస్వి విమర్శించారు. వలసకార్మికుల సంగతి చెప్పనక్కర్లేదని, కరోనా లాక్‌డౌన్‌తో నిరుద్యోగులుగా మారిన వారికి ప్రభుత్వ పథకాలు చేరలేదని అన్నారు. ఏప్రిల్‌ నుండి ఆగస్టు వరకు 11 లక్షల జాబ్‌కార్డులు జారీ చేసినప్పటికీ..2,132 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని కల్పించబడిందని..ఎందుకని? అని ప్రశ్నించారు.