Jan 26,2021 08:26

 హైదరాబాద్‌ బ్యూరో: రైతులతో పెట్టుకున్న మోడీకి పతనం తప్పదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ అన్నారు. పోడు సాగుదారులకు పట్టాలివ్వాలనీ, అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నిర్వహించిన పోడు సాగుదారుల ప్రజాగర్జన యాత్ర లక్ష్మీదేవిపల్లి మండలం మార్కెట్‌ యార్డ్‌ నుంచి కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వరకు సాగింది. ప్రదర్శన, బహిరంగసభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్నాచౌక్‌లో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. బృందాకరత్‌ మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం రైతులను సంప్రదించకుండా ఆదానీ, అంబానీల కోసమే రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు. దేశంలో గణతంత్ర దినోత్సవం రోజున లక్ష ట్రాక్టర్లతో అన్నదాతలు చేపట్టే నిరసన ర్యాలీ మోడీ ప్రభుత్వానికి గొడ్డలిపెట్టన్నారు. ఢిల్లీలో 60 రోజులుగా రైతులు చేస్తున్న నిరసన పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని, దానికి మూల్యం చెల్లించక తప్పదన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలనీ, రైతులకు అండగా నిలిచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీలకు జీవన, మరణ సమస్యగా మారిన పోడు సాగు పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కమ్యూనిస్టుల సహకారంతో తీసుకువచ్చిన అటవీహక్కుల చట్టానికి కేంద్రం తూట్లుపొడుస్తున్నదని విమర్శించారు. తమ్మినేని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో సాగుదారులకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి హరితహారం పేరుతో భూములను లాక్కుని కుటిల రాజకీయాలకు టిఆర్‌ఎస్‌ పాల్పడుతున్నదని విమర్శిం చారు.రాష్ట్రంలో సుమారు 2లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు సగం కూడా ఇవ్వలేదన్నారు. అనంతరం మాజీ ఎంపి మీడియం బాబురావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినే ని సుదర్శన్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిల య్య, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే.రమేష్‌ మాట్లాడారు.