Mar 02,2021 21:55

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న వి.రాంభూపాల్‌

మోడీది దగా పాలన
అనంతపురం కలెక్టరేట్‌:
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల పట్ల దగాకోరుగా వ్యవహరిస్తోందని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరించరాదని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 5న నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో 'విశాఖ ఉక్కును అమ్మనివ్వం.. బిజెపి ద్రోహాన్ని తిప్పకొడదాం.. సొంత గనులను సాధిద్దాం' అన్న అంశంపై రౌంట్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిఐటియు ఉత్తర ప్రాంత జిల్లా అధ్యక్షురాలు ఎం.నాగమణి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి సిపిఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, సిపిఐఎంఎల్‌ జిల్లా కార్యదర్శి సి.పెద్దన్న, సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, ఎపి ఎన్జీవో సంఘం నగర అధ్యక్షులు మనోహర్‌రెడ్డి, కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓ.నల్లప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.బాలరంగయ్య, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పట్ల దగాకోరుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బిజెపి పాగా వేయడానికి సాధ్యం లేకపోవడంతో ప్రజలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. విభజన సమయంలోనూ, తర్వాత రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. సెంట్రల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేసి 6 సంవత్సరాలు కావస్తున్నా యూనివర్శిటీ ప్రహరీగోడ కూడా పూర్తికాని పరిస్థితి నెలకొందన్నారు. పూర్తిస్తాయిలో యూనివర్శిటీ ఏర్పాటు చేయడానికి ఎంత కాలం పడుతుందో పాలకులు చెప్పలేకపోతున్నారన్నారు. రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నల్లధనం తెస్తామని జన్‌ధన్‌ ఖాతాల్లో జమ చేస్తామని గొప్పలు చెప్పిన మోదీ ఉన్న మూలధనం అమ్మే స్థితికి దిగజారిపోయారన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తున్న మోదీ ప్రభుత్వానికి విశాఖ ఉక్కు పరిశ్రమపై పడిందన్నారు. నాడు రష్యా సహకారంతో విశాఖ ఉక్కు ఏర్పాటైందన్నారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైందన్నారు. వేలాది మంది ఉద్యోగులు, లక్షల కుటుంబాలు ఉక్కు పరిశ్రమను ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. దేశానికి ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న విశాఖను ప్రయివేటీకరించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి లేఖలతో మోదీ ప్రభుత్వం కదిలే పరిస్థితి లేదన్నారు. లేఖ ఇచ్చిన తరువాతనే మోదీ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటీకరణ వేగవంతం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికే ఐదు రోజులు నిరాహార దీక్షలు చేశారన్నారు. 5న జరిగే రాష్ట్ర బంద్‌కు వైఎస్‌ఆర్‌సిపి ప్రతక్ష్యంగా పాల్గొంటారో లేదో ప్రకటించాలన్నారు. టిడిపి ఐక్య పోరాటాల్లో హాజరు కావాలన్నారు. సిపిఐఎంఎల్‌ జిల్లా కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ 32 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ మేరకు ఐక్య ఉద్యమ కార్యచరణతో ముందుకెళ్లనున్నట్లు చెప్పారు. సిసిఐంఎల్‌న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా పోరాటాలతో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు నాయకులు ఏసురత్నం, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, ఐఎన్‌టియుసి నాయకులు శ్రీధర్‌, ఎఐయుటియుసి శేఖర్‌, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి ముస్కిన్‌, ఆటో యూనిన్‌ నాయకులు లతీఫ్‌, భవన నిర్మాణ రంగం కార్మికుల యూనియన్‌ నాయకులు జిలాన్‌, బాబా, రైతు కూలీ సంఘం నాయకులు చంద్రశేఖర్‌, రాయుడు, చేనేత వృత్తిదారుల సంఘం నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.