Feb 26,2021 11:29

అహ్మదాబాద్‌ : ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో నామకరణం చేసి బుధవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనంతరం అదే రోజు భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్‌ పింక్‌ బాల్‌ డే/నైట్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. అయితే ఐదు రోజులు సాగాల్సిన ఈ మ్యాచ్‌ కేవలం రెండు రోజుల్లోనే ముగిసి క్రికెట్‌ ప్రియులను నిరాశకు గురిచేసింది. మరోపక్క మ్యాచ్‌ రెండు రోజులకే ముగియడంతో మోతేరా స్టేడియం పిచ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెస్ట్‌ మ్యాచ్‌కు ఈ పిచ్‌ పనికి రాదంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తుండగా.. అసలు టెస్ట్‌ మ్యాచ్‌కు ఇలాంటి వికెట్‌ ఇస్తారా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరేమో పిచ్‌ బాగానే ఉందని, బ్యాట్స్‌మెన్ల వైఫల్యంతోనే మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసిందని పేర్కొంటున్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్లు 112 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలారు. ఇందులో భారత్‌ దిగ్గజ స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌ మొత్తంగా 11 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. మరో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా 7 వికెట్లు పడగొట్టాడు. వీరు గొప్ప బౌలర్లే అయినప్పటికీ.. ఇంగ్లాండ్‌ బౌలర్లు కూడా విజృంభించి వికెట్లు తీశారు. భారీ స్కోర్‌ నమోదు చేయకుండా కట్టడి చేయగలిగారు. భారత్‌ తొలి, రెండు ఇన్నింగ్స్‌ల్లో 145 (ఆలౌట్‌), 49 (విజయానికి కావాల్సిన పరుగులు) మాత్రమే చేయగలిగింది. అంటే.. ఈ పిచ్‌పై ఎంతటి ఆటగాడైనా స్పిన్‌కు వికెట్లు సమర్పించుకోవాల్సిందేనని రుజువైంది. ఈ క్రమంలోనే మ్యాచ్‌ అనంతరం మోతేరా పిచ్‌పై రగడ మొదలైంది. ఈ పిచ్‌ టెస్ట్‌లకు పనికిరాదంటూ పలువురు సీనియర్‌ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

* ''ఈ పిచ్‌ టెస్ట్‌ మ్యాచ్‌లకు పనికిరాదు. అందుకే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌటైంది.'' - భారత మాజీ ఆటగాడు వివిఎస్‌ లక్ష్మణ్‌

* ''ఇలాంటి వికెట్‌పై ఆడితే అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌ టెస్ట్‌ల్లో వరుసగా 1000, 800 వికెట్లు సులువుగా తీసేవారు.'' - భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌

* ''ఇది టెస్ట్‌ వికెట్‌ కాదు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేసుంటే భారత్‌ ఇబ్బంది పడేది'' - హర్బజన్‌ సింగ్‌

* ''ఇలాంటి పిచ్‌పై ఒక్కో జట్టుకు మూడు ఇన్నింగ్స్‌ కేటాయించాలి'' - మైకేల్‌ వాన్‌

* ''రెండు రోజుల్లోనూ బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆటగాళ్లు నిజాయితీగా ఉంటే.. పేలవంగా ఆడామనే ఒప్పుకుంటారు. ఇక మొత్తంగా 30లో 21 వికెట్లు.. నేరుగా వికెట్‌ టు వికెట్‌ విసిరిన బంతులకే దక్కాయి'' - ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌

* ''మోతేరా ఎలాంటి పిచ్‌ అనేది అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి) నిర్ణయిస్తుంది. తమవరకైతే చాలెంజింగ్‌ వికెట్‌గానే భావిస్తున్నాం. దీనిపై ఆడటం చాలా కష్టం. మా అవకాశాలను వినియోగించుకోలేకపోయాం. నేను 5 వికెట్లు తీశానంటే అది పిచ్‌ వల్లే'' - ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌

* అయితే భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ మాత్రం మొతెరా వికెట్‌ను తప్పుబట్టడానికి లేదన్నాడు. బ్యాట్స్‌మెన్‌ అతిగా డిఫెన్స్‌కు పోవడం వల్లే వికెట్లు ఇచ్చుకున్నారని స్పష్టం చేశాడు.

*''మోతేరా పిచ్‌ బాగానే ఉంది. గులాబీ టెస్ట్‌ రెండు రోజుల్లోనే ముగియడానికి రెండు జట్ల బ్యాట్స్‌మెన్ల వైఫల్యమే కారణం.'' - టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ

అన్‌ ఫిట్‌ అయితే..
ఇక ఐసిసి నిబంధనల ప్రకారం పిచ్‌ అటు పూర్తిగా బ్యాటింగ్‌కు గానీ, ఇటు బౌలింగ్‌కు గానీ అనుకూలంగా ఉండకూడదు. రెండింటి మధ్య సమపోరు ఉండాలి. అలా కాకుండా వికెట్‌ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించినా.. లేదా బౌలింగ్‌కు అనుకూలించినా.. పూర్‌ పిచ్‌గా పరగణిస్తారు. అప్పుడు హోమ్‌ టీమ్‌కు మూడు పాయింట్స్‌ కోత విధిస్తారు. ఇక మోతేరా పిచ్‌ అన్‌ ఫిట్‌ అని తెలితే వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ మూడు పాయింట్లు కోల్పోనుంది. ప్రస్తుతం 490 పాయింట్లతో కోహ్లీసేన టాప్‌లో ఉంది.